ప్రజాపాలన అంటూ వచ్చి.. బుల్డోజర్ పాలనతో పేదల బతుకులు ఆగం చేసింది కాంగ్రెస్ సర్కారు..నగరాన్ని నమ్ముకొని దశాబ్దాలుగా జీవిస్తూ.. పైసాపైసా కూడబెట్టి నిర్మించుకున్న సామాన్యుల కలల సౌధంపై ‘హైడ్రా’తో విరుచుకుపడింది. రాత్రికి రాత్రే కూల్చివేతలు చేపట్టి ఎందరో జీవితాలను చిన్నాభిన్నం చేసింది. పదేండ్ల కేసీఆర్ సర్కారు గ్రేటర్లో లక్ష ఇండ్లు నిర్మించి..65 వేల గృహాలను పంపిణీ చేసి..అభాగ్యులకు నిలువనీడ కల్పించింది. కానీ రెండేండ్ల కాంగ్రెస్ పాలనాకాలంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించలేదు సరికదా.. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లనూ కేటాయించలేదు. పేదలపై ప్రతాపం చూపుతూ..620 ఇండ్లను కూల్చివేసి..కట్టుబట్టలతో రోడ్డుపై నిలబెట్టింది. అదే సమయంలో పెద్దలపై కనికరం చూపింది. ఇదీ రెండేండ్ల రేవంత్ మార్క్ పాలనకు మచ్చుతునకలు.
– ఫీచర్స్ స్టోరీ
పేదల కోసం కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూంలు..
తెలంగాణ ఏర్పాటు కాగానే కేసీఆర్ ముఖ్యమంత్రిగా పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు ఉండాలంటూ పథకం ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇండ్లు లేని పేదలకు ఈ స్కీమ్ ద్వారా లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అదే క్రమంలో బీఆర్ఎస్ సర్కారు జీహెచ్ఎంసీ పరిధిలోని 109 ప్రాంతాల్లో రూ.9714 కోట్ల అంచనా వ్యయంతో లక్ష డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో 95,315 గృహాల నిర్మాణ పనులు ప్రారంభం కాగా కోర్టు కేసులు ఇతర కారణాల వల్ల 4685 ఇండ్లు ప్రారంభం కాలేదు. మొత్తం 69673 ఇండ్ల నిర్మాణం పూర్తవ్వగా 64369 గృహాలను కేటాయించారు. పూర్తయిన వాటిలో 4591 ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. అందులో అప్పటికే ఉన్న నిర్మాణాలు కూల్చి అదే స్థలంలో కట్టిన 1952 ఇండ్లు కూడా ఉన్నాయి.
మూసీ నిర్వాసితులకు ఇండ్లు కేటాయించాలంటే ప్రస్తుతం సిద్ధంగా ఉన్న 4591 గృహాలకు అదనంగా మరో 10500 ఇళ్లు కావాలి. కేసీఆర్ హయాంలో జీహెచ్ఎంసీ పరిధిలోని కొల్లూర్, చర్లపల్లి, అమీన్పూర్, బహదూర్‌పల్లి, దుండిగల్, నార్సింగి, శంకరపల్లి, నల్లగండ్ల, మురహరిపల్లి, చైతన్యనగర్, రాంపల్లి, తూముకుంట ప్రాంతాల్లో డబుల్బెడ్రూం ఇండ్లు పంపిణీ చేశారు. తన పదేండ్ల పాలనలో కేసీఆర్ పేదలకు నిలువనీడ కల్పించేందుకు పడిన తపన గురించి నేటికీ డబుల్బెడ్రూం అందుకున్న లబ్ధిదారులు గుర్తుచేసుకుంటున్నారు.
నాలుగు శతాబ్దాల హైదరాబాద్ నగరాన్ని నమ్ముకొని దశాబ్దాలుగా జీవిస్తూ.. పైసా పైసా కూడబెట్టి నిర్మించుకున్న ఇండ్లు క్షణాల్లో నేలమట్టమై… రాత్రికి రాత్రి కుటుంబాలు వీధినపడటం అనేది హైదరాబాద్ చరిత్రలో ఇదే తొలిసారి. హైడ్రాను ఏర్పాటు చేస్తూ రేవంత్ సర్కారు గత ఏడాది జూలై 19న జీవో 99 జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ సంస్థ వందలాది నిర్మాణాలను కూల్చివేసింది. నిన్నమొన్నటిదాకా తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ హయాంలో పని చేసిన బాహుబలి బుల్డోజర్లు రేవంత్ సర్కార్ హయాంలో మొదటిసారిగా సామాన్యుడి కలల సౌధాలను నేలమట్టం చేసే పనికి వినియోగించింది. గ్రేటర్ పరిధిలో ఈ రెండేండ్ల కాంగ్రెస్ పాలనాకాలంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించలేదు సరికదా నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా పేదలకు కేటాయించలేదు.
620 ఇండ్లు..నిర్మాణాలు నేలమట్టం
రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో ఇండ్ల నిర్మాణం చేయడం మాటేమో కానీ హైడ్రాను తీసుకొచ్చి పేదల ఇండ్లపై బుల్డోజర్లు నడిపారు. కూటికోసం కోటి కష్టాలు పడుతున్న పేదలను కూడు, నీడ లేకుండా నడిరోడ్డుపై నిలబెట్టారు. హైడ్రా కూల్చివేతల్లో ఎక్కువగా నష్టపోయింది పేద, మధ్యతరగతి వారే. వేర్వేరు ప్రాంతాలనుంచి పొట్టచేత పట్టుకుని హైదరాబాద్‌కు వచ్చిన వారికి హైడ్రా రూపంలో వచ్చిన పెద్ద కష్టం ఇది. తాము ఇండ్లు కట్టుకునేటప్పుడు కూడా ఇది ఎఫ్టీఎల్లో ఉంటుందా అని అడిగామని, పర్మిషన్లు తీసుకున్నామని, ఇంటి బిల్లులు, నల్లాబిల్లులు, కరెంట్ బిల్లులు కడతామని చెబుతున్నా.. వినకుండా చిన్నచిన్న పిల్లలని కూడా చూడకుండా కట్టుకున్న ఇండ్లను కూల్చేసి తమను రోడ్డున పడేశారంటూ వారు ఆవేదన చెందుతున్నారు.
హైడ్రా ఇప్పటివరకు సుమారుగా 620 వరకు నిర్మాణాలను కూల్చేసింది. అందులో గత సంవత్సరం ఆగస్ట్, సెప్టెంబర్ రెండు నెలలలోనే 262 నిర్మాణాలు కూల్చివేసింది. ఒక్క అమీన్పూర్ చెరువులోనే 24 నిర్మాణాలు కూల్చివేయగా, సున్నంచెరువులో 42 నిర్మాణాలు, కత్వా చెరువులో13 విల్లాలు కూల్చేసింది. అందులో అమీన్పూర్, సున్నంచెరువులలో ఎక్కువగా నష్టపోయింది పేదవారే కావడం గమనార్హం. తమ కుటుంబాలతో సహా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి జీవనం గడుపుతూ ఇండ్లు నిర్మించుకున్న పేదలు, మధ్యతరగతి వారికి హైడ్రా రాత్రికిరాత్రే షాకిచ్చింది.
ఎలాంటి నోటీసులు లేకుండా వారిని ఉన్నవారిని ఉన్నట్లుగానే కట్టుబట్టలతో బయటకు పంపి బుల్డోజర్లతో వారి ఇండ్లను నేలమట్టం చేసింది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్నారంటూ సున్నంచెరువు, నల్లచెరువు, నెక్నం చెరువు.. ఇలా చాలా చోట్ల హైడ్రా వచ్చిన రెండు నెలల్లోనే దూకుడుగా పోయింది. పెద్దలు అనుకున్నవారికి, తనను నియమించినవారికి సన్నిహితులనుకున్న వారికి నోటీసులిచ్చింది. కానీ పేదోళ్లకు మాత్రం నోటీసుల జాడే లేదు. రాత్రికి రాత్రే కూల్చివేతలు చేపట్టి వారిని కట్టుబట్టలతో రోడ్డుపై నిలబెట్టింది. హైడ్రా చేసిన విధ్వంసపు ఆనవాళ్లు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపిస్తున్నాయి.
ఒక్క ఇందిరమ్మ ఇల్లూ లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో ఇందిరమ్మ ఇండ్లు ఒకటి. అటువంటి ప్రధాన హామీ నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ విఫలమైంది. గ్రేటర్ హైదరాబాద్‌లో జీ+3 విధానంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని జూన్‌లో నిర్ణయించినా ఇప్పటివరకు ఒక్కఅడుగూ పడలేదు. రేవంత్ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇండ్లు ఒకటికాగా అసలు వాటి కోసం ఏదో చేస్తున్నామని అప్పుడప్పుడు ప్రకటనలు ఇస్తున్నారే తప్ప అసలు ఆ దిశగా రెండేండ్ల కాలంలో ఒక్క పని జరగలేదు. ఐఎస్‌సదన్, దిల్సుఖ్నగర్ వంటి పదహారు చోట్ల మురికివాడల్లో స్థలాలు గుర్తించామని చెబుతున్నా గుర్తించిన వాటిలో 14 స్థలాల్లో వివాదాలున్నాయని అధికారులు చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున మొత్తం 84వేల ఇండ్లను కేటాయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత మంత్రులు, అధికారులు చెప్పినా పనులు మాత్రం జరగడం లేదు. ఇక డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలోనూ కేసీఆర్ హయాంలో నిర్మించిన లక్ష ఇండ్లల్లో వివిధ దశల్లో నిలిచిన 25వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి రూ.3వేల కోట్లు అవసరమని అధికారులు నివేదిక పంపారు. కానీ పూర్తయిన ఇండ్లు 4500 ఉన్నప్పటికీ వాటిని పేదలకు కేటాయించకుండా నామమాత్రంగా వదిలేశారని పేదలు విమర్శిస్తున్నారు. రెండేండ్లుగా నిలిచిపోయిన మిగతా ఇండ్లను పూర్తిచేయడంలోనూ రేవంత్ సర్కార్ ఫెయిలయింది.
ప్రజలే బుద్ధి చెబుతారు..
– బాధితురాలు
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినందుకు పేద కుటుంబాలపై విరుచుకుపడుతుందని ఎవరూ ఊహించలేదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మాకు సమయం కూడా ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలంటూ కూల్చి వేసి మమ్మల్ని రోడ్డు పాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారు.
పేదలపై హైడ్రా ప్రతాపం
పేదలపై హైడ్రా మళ్లీ విరుచుకుపడింది. మల్లాపూర్ నాచారం డివిజన్ సరిహద్దులోని బాబానగర్‌లో మూతపడిన ఆగ్రో ఇండస్ట్రిస్ కార్పొరేషన్‌కు చెందిన స్థలంలో ఉన్న గృహాలను నేలమట్టం చేసింది. హైడ్రా అధికారులు పోలీసు బందోబస్తుతో 15 వరకు నిర్మాణాలను కూల్చివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇండ్ల నిర్మాణం చేపట్టారని, ఇప్పుడేమో అక్రమ నిర్మాణాలంటూ..కనీసం సమయం.. నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చివేయడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
-ఉప్పల్