Hydraa | మాదాపూర్, ఏప్రిల్ 19: ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలసిన నిర్మాణాలపై హైడ్రా కొరడా జుళిపించింది. హైదరాబాద్ కొండాపూర్‌లోని వసంత సిటీ సమీపంలో ఉన్న సర్వే నంబర్ 79 లో 39 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వసంత కృష్ణ ప్రసాద్ తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. తన ముగ్గురు అనుచరుల సాయంతో దాదాపు రూ.2వేల కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసి నాలుగు భాగాలుగా విభజించి పలు షెడ్లు, కార్యాలయాలు, గెస్ట్ హౌస్‌లు నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇలా తప్పుడు పత్రాలతో గతంలో అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
మూడు నెలల ముందు అందిన ఫిర్యాదు
వసంత కృష్ణ ప్రసాద్ తన అనుచరులతో కలిసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు. అయితే ఆ సమయంలో అతనికి సహకరించిన అనుచరులతో ఇటీవల విబేధాలు తలెత్తాయి. దీంతో కృష్ణప్రసాద్‌కు దూరంగా ఉంటున్న వారు.. మూడు నెలల క్రితం హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైడ్రా బృందం తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లుగా నిర్ధారించారు. ఈ క్రమంలోనే శనివారం చర్యలకు దిగారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భారీ షెడ్లు, కార్యాలయాలు, గెస్ట్ హౌస్‌లు, ప్రహారీ గోడలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. అనంతరం ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లుగా హైడ్రా అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు.