Hydraa | బంజారాహిల్స్, మే 23: జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలో జీహెచ్ఎంసీకి చెందిన పార్కుకు వెళ్లేదారిని మూసివేయడంతో పాటు నాలాపై నిర్మించిన ఆక్రమణలను హైడ్రా సిబ్బంది శుక్రవారం కూల్చివేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 41లో పెద్దమ్మ గుడి పక్కన సుమారు రెండెకరాల జీహెచ్ఎంసీ పార్కు స్థలం ఉంది. దానిని అనుకుని అవసరాల రుక్మాంగదరావు అనే వ్యక్తికి వెయ్యి గజాల ప్లాట్ ఉంది. దీనిలో 200 గజాల విస్తీర్ణంలో ఇంటిని కట్టి కే. శ్రీనివాస్ అనే వ్యక్తికి పదిహేనేళ్ల క్రితం అద్దెకు ఇచ్చాడు. కాగా పెద్దమ్మగుడిని అనుకుని సుమారు 200 కోట్ల విలువైన 2ఎకరాల జీహెచ్ఎంసీ పార్కు స్థలం ఉంది. ఆ స్థలంలోకి వెళ్లడానికి గతంలో 30 ఫీట్ల రోడ్డు ఉండేది. అయితే రుక్మాంగదరావు నుంచి ఇంటిని అద్దెకు తీసుకున్న శ్రీనివాస్ ఇంటిముందున్న ఖాళీ స్థలంతో పాటు నాలాను, సగం రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. పార్కులోకి వెళ్లేందుకు అవకాశం లేకుండా ప్రహరీ నిర్మించుకుని సొంతంగా వాడుకుంటున్నారు. సుమారు 1000 గజాల స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేసి హోటళ్లు, టెంట్‌హౌజ్, హాస్టల్, కారు మెకానిక్ షెడ్డు తదితర వ్యాపారాలకు అద్దెకు ఇచ్చి లక్షలాది రూపాయలు అద్దెలు వసూలు చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే నాలాతో పాటు పార్కుకు వెళ్లే రోడ్డును ఆక్రమించాడంటూ జూబ్లీహిల్స్ సొసైటీతో పాటు స్థానికులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదులు చేశారు.
ఈ వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన అనంతరం ఆక్రమణలను నిర్ధారించారు. ఆక్రమణల తొలగింపుపై కిరాయిదారుడికి హైడ్రా నోటీసులు జారీ చేయగా హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు విచారించిన హైకోర్టు ఆక్రమణలను తొలగించాల్సిందేనంటూ తీర్పు ఇచ్చింది. దీంతో శుక్రవారం ఉదయాన్నే హైడ్రా రంగంలోకి దిగి భారీ హిటాచీలు, జేసీబీల సాయంతో కూల్చివేతలు చేపట్టారు. రెండు భారీ భవనాలతో పాటు నాలాపై నిర్మించిన ప్రహరీలను కూల్చేసిన హైడ్రా సిబ్బంది జీహెచ్ఎంసీ పార్కు స్థలంలోకి వెళ్లేలా రోడ్డును పునరుద్ధరించారు. ఈ స్థలాన్ని జీహెచ్ఎంసీ పార్కుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.