Hydraa | మణికొండ, మే 19 : హైదరాబాద్ పుప్పాలగూడలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఆపించి, వాటిని తొలగించినట్లుగా హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు.
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ డాలర్ హిల్స్ కాలనీలో లేఅవుట్‌ను మార్చి ఆక్రమణలకు పాల్పడుతున్నారని కాలనీవాసులు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారం కింద ఆ కాలనీలో పర్యటించిన ఏవీ రంగనాథ్ వివరాలు సేకరించారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం డాలర్‌హిల్స్ కాలనీలో ఆక్రమణలు జరుగుతున్నాయని తేలడంతో ఆక్రమించిన రేకుల షెడ్డును హైడ్రా అధికారులు తొలగించారు. లేఅవుట్లో కొంతభాగంతో పాటు రోడ్డు, పార్క్‌ను కబ్జా చేసి ఈ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించి వాటిని కూల్చివేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. డాలర్ హిల్స్ ప్లాట్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాతే చర్యలు చేపట్టామని హైడ్రా అధికారులు తెలిపారు. ఇరుపక్షాలను పిలిచి విచారించిన తర్వాత పార్కు స్థలం, రహదారులు కబ్జాకు గురి అయినట్టు నిర్ధారించినట్లు పేర్కొన్నారు.