హైదరాబాద్: హైదరాబాద్‌లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూకట్‌పల్లిలోని నల్లచెరువులో ఆక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నల్లచెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా.. 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో 7 ఎకరాలు ఉన్నట్లు తేలింది. బఫర్‌జోన్‌లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో నివాసం ఉన్న భవనాలను మినహాయించి చెరువు ఆక్రమించి నిర్మించిన 16 షెడ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే వారందరికి అధికారులు నోటీసులు జారీచేశారు. దీంతోపాటు అమీన్పూర్ పరిధిలోనూ అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్నది.
కాగా, కోకాపేట గ్రామ సర్వే నంబర్ 147లో దాదాపు 800 గజాల సర్కారు స్థలాన్ని కొందరు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేసిన విషయం తెలిసిందే. దశాబ్దకాలం తాము ఇక్కడ నిర్మాణాలను చేపట్టి.. నివాసముంటున్నామని, ఇప్పుడు హైడ్రా అధికారులు తమ ఇండ్లపై బుల్డోజర్లు పెట్టి కూల్చివేశారంటూ.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సమాచారం ఇవ్వకుండా పేదల నివాసాలను హైడ్రా, రెవెన్యూ అధికారులు కూల్చివేయడం సమంజసం కాదని పలువురు నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోకాపేట గ్రామ సర్వే నంబర్ 147లో దాదాపు 800 గజాల స్థలాల్లో వేర్వేరుగా కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి నిర్మాణాలను చేపట్టి.. నివాసాలను ఏర్పర్చుకున్నారని వీటిపై స్థానికుల ఫిర్యాదుల మేరకు స్పందించి కూల్చివేసినట్లు తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.