ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఒక నలుగురు ఉన్న వెహికల్ మా కాలనీలో తిరుగుతుంటే వణుకుపుడుతోంది. ఒక తెలియని 144 సెక్షన్ మా దగ్గర కనిపిస్తున్నది. మా ఇంటిని ఇంతకు ముందు ఎవరైనా చూస్తుంటే అందంగా ఉందికదా.. చూస్తున్నారు అనుకునేది. కానీ ఇప్పుడెవరైనా మా ఇంటివైపు చూస్తే గుబులు అనిపిస్తుంది. వీళ్లెవరో.. ఏం చేస్తారో.. ఇళ్లు కూలగొట్టడానికి వచ్చారా అంటూ క్షణక్షణం భయంతో బతుకుతున్నాం.
– ఇది ఓ మధ్యతరగతి యువకుడి ఆవేదన
ఈ వయసులో మాకిది అవసరమా.. మేం ఏం కావాలి.. మా జీవితమేంటి.. ఇవాళ మాట్లాడుతున్నం. రేపు ఎక్కడ ఉంటామో తెలియదు. అన్నీ లీగల్‌గా ఉన్నా..మమ్మల్ని ఇంత బాధపెడతరా..
అంటూ బోరుమంది ఓ మహిళ
Telangana Bhavan | సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 ( నమస్తే తెలంగాణ ): నిన్న కూడా ఒక రిజిస్ట్రేషన్ అయింది. హైడ్రా వచ్చిందని రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు తెలియదా.. అంతెందుకు.. మేం కట్టే ఫీజు ఎవరికి పోతుంది. గవర్నమెంట్‌కు కాదా..ఒక వ్యవస్థ లోపానికి ప్రజలను బలిచేస్తారా.. మా పేరెంట్స్, పిల్లలతో సహా మేం రోడ్డున పడాలా.. మీకు పేరెంట్స్, పిల్లలు లేరా.. వాళ్లకు కూడా అలాగే జరిగితే సంతోషపడతారా.. రేవంత్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించిందో మధ్య తరగతి యువతి
మేం ఉన్నత విద్య చదువుకున్నాం. గౌరవ కుటుంబాల నుంచి వచ్చాం. అన్నీ చూసుకుని లీగల్‌గా ఉన్నాకే కొనుక్కున్నాం. లక్షల రుణం తీసుకుని ఇల్లు కట్టుకుంటే మమ్మల్ని కబ్జాదారులు అంటారా.. చాలా బాధగా అనిపిస్తుంది. బిల్డర్స్‌తో మీరు కుమ్ముక్కవుతారు.. మమ్మల్ని రోడ్డు మీద పడేస్తారా..ఇదెక్కడి పాలన.. ఓ యువ ఉద్యోగి ప్రశ్న ఇది.
శనివారం తెలంగాణ భవన్‌కు తరలివచ్చిన హైడ్రా బాధితులు మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డిని కలిసి బోరుమన్నారు. ఒకవైపు తాము అన్నీ లీగల్‌గా డాక్యుమెంట్స్ చూసుకొని.. బ్యాంకులు వెరిఫికేషన్లు చేసి లోన్లు ఇస్తే..ఇన్నేండ్ల తర్వాత వచ్చి కబ్జాదారులంటుంటే తమకు ఎంత బాధగా ఉందో తెలుసా అంటూ ఏడ్చేశారు. ‘ఏం చెప్పకుండా మా ఇండ్లు కూలగొడ్తామంటే ఎక్కడికి పోవాలి.. పిల్లలతో సహా రోడ్డున పడాల్నా’ అంటూ ప్రశ్నించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లకు మార్కింగ్ చేశారని, పేదతరగతి, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చడమే అభివృద్ధి చేయడమా అని ప్రశ్నించారు.
పేదల ఉసురు తగులుతుంది
చైతన్యపురి, కొత్తపేట డివిజన్ల పరిధిలోని భవానీనగర్, వినాయక్‌నగర్, ఫణిగిరికాలనీ, సత్యానగర్, న్యూ మారుతీనగర్ కాలనీలకు చెందిన మూసీ నిర్వాసితులు.. నిరసన తెలిపారు. ‘మా బతుకుల్లో ఏమైనా మార్పు తెస్తాడేమోనని మల్కాజిగిరి ఎంపీగా గెలిపించి.. రాజకీయ భిక్ష పెట్టినం. నిన్ను గెలిపిస్తే ఏ ఒక్కనాడు కాలనీల్లోకి వచ్చి ప్రజలు ఎలా ఉన్నారన్న చూసిన పాపాన పోలేదు. అయినా సహించాం.. పేదల ఉసురు నీకు తగులుతుంది’… అంటూ న్యూమారుతీనగర్ కాలనీకి చెందిన హేమలత శాపనార్థాలు పెట్టారు.