HYDRAA | సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరంలో హైడ్రా సరికొత్తగా రూపుదిద్దుకోబోతున్నది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) జనవరి 6వ తేదీ నుంచి గ్రీవెన్స్ ప్రారంభించనున్నది. ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో ‘ప్రజావాణి’ నిర్వహించి అందులో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ఒంటిగంట వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫిర్యాదుల్లో ప్రధానంగా చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలపై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తున్నది. అయితే ప్రభుత్వ స్థలాలు, పార్కులకు సంబంధించి కబ్జాలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ వాటిని జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగానికి రిఫర్ చేయనున్నట్లు తెలిసింది. ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బందితో కలిసి తమ వద్దకు వచ్చే వాటర్‌బాడీస్ ఆక్రమణల ఫిర్యాదులపై సమగ్రంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరపడానికి నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదుల రూపంలో వచ్చే ఆక్రమణలపై స్థానికులతో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా కొత్తగా జరిగే కబ్జాలను అరికట్టవచ్చని హైడ్రా అధికారి ఒకరు చెప్పారు.
ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేసే అవకాశాన్ని హైడ్రా కల్పించడంతో ఆక్రమణల ఫిర్యాదుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా మరిన్ని ఆక్రమణలు వెలుగులోకి వచ్చే అవకాశముందని హైడ్రా అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా వాట్సప్, ఫోన్‌కాల్స్, మెయిల్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన హైడ్రా వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలకు దిగుతున్నది. కొన్ని కోర్టు వివాదాల అంశాలున్నప్పటికీ వాటిపై లీగల్ ఒపినియన్ తీసుకొని ముందుకెళ్తున్నామని హైడ్రా అధికారులు చెప్పారు. ఇప్పటివరకు హైడ్రాకు 4వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. మరోవైపు జోన్ల వారీగా ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి ఒక్కో అధికారితోపాటు వారికి పోలీస్, ఇతర శాఖల సీనియర్ అధికారి ఒకరిని ఇంచార్జిగా నియమించి ఆయా బృందాలు హైడ్రాకు గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టనున్నారు. వచ్చే ఫిర్యాదులపై ఫిర్యాదుదారుల సహకారంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలకు కూడా ఇవే బృందాలు పనిచేయనున్నాయి. తాము ఇచ్చిన ఫిర్యాదులపై ప్రతి శుక్రవారం హైడ్రా అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకునే అవకాశం కూడా కల్పిస్తామని హైడ్రా బృందం చెబుతున్నది. వచ్చిన ఫిర్యాదులపై 10 నుంచి పదిహేను రోజుల్లోనే నివేదిక తయారు చేసి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.