FTL | సిటీబ్యూరో, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): హైడ్రా చర్యలతో నీటిపారుదల శాఖలో కలకలం రేగుతోంది. ఉస్మాన్‌సాగర్ ఎఫ్టీఎల్ నిర్ధారణకు సంబంధించిన నివేదికలో అవకతవకలకు పాల్పడినట్లు ముగ్గురు సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి హైడ్రా సిఫారసు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఆ ముగ్గురు అధికారులపై పెనాల్టీ చర్యలు తీసుకునే దిశగా చర్యలు ప్రారంభించారు. లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ పేరిట వెలిసిన చాలా హైరైజ్డ్ భవనాల విషయంలో నీటి పారుదల శాఖ అధికారుల ఎన్ఓసీలు సమస్యగా మారుతున్నాయని పలు అంతర్గత సమావేశాల్లో రంగనాథ్ వ్యాఖ్యానించారు.
హైడ్రా ప్రారంభమైన కొన్ని రోజులకే ఇరిగేషన్‌కు సంబంధించిన ఒక అధికారిపై చర్యలకు ప్రభుత్వానికి హైడ్రా లేఖ రాసింది. తాజాగా రిటైర్డ్ ఎస్ఈ వెంకటేశం, ఈఈలు భీమ్‌ప్రసాద్, శేఖర్‌రెడ్డిలపై చర్యలకు సిఫారసు చేసింది. మరో ఎనిమిది మంది నీటి పారుదల శాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని లేఖలు రాయనున్నట్లు సమాచారం. వీరంతా తమ పరిధిలో ఉన్న జోన్లలో ఎన్ఓసీలు జారీ చేయడం వల్ల చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయంటూ రంగనాథ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
పటాన్చెరు, ఇస్నాపూర్, దుండిగల్, ఘట్కేసర్, శంషాబాద్, మేడ్చల్, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్ తదితర ప్రాంతాల్లో లేక్‌వ్యూ ప్రాజెక్టుల పేరిట వెలిసిన పలు అపార్ట్మెంట్లకు పాత మ్యాపులతో ఎన్ఓసీలు ఇచ్చినట్లు హెచ్ఎండీఏ, ఇరిగేషన్, హైడ్రా అధికారులు గుర్తించారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో సదరు స్థలం బఫర్‌జోన్‌లో ఉన్నట్లు తేలితే గూగుల్ మ్యాపులతో దరఖాస్తులను జతచేసి, పాత మ్యాపుల ఆధారంగా ఎన్ఓసీలు తీసుకున్నట్లు హైడ్రా గుర్తించింది. కొన్నిచోట్ల మ్యాపులే మాయమయ్యాయని కూడా తమ పరిశీలనలో తేల్చారు. అంతేకాకుండా ఇటీవల హైడ్రా బృందం పలు చెరువుల సందర్శనలో నీటిపారుదల శాఖ అధికారుల తీరుపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆక్రమణదారులపై పోలీస్‌లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే కొన్నిచోట్ల ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఎన్ఓసీలు హైడ్రాకు తలనొప్పిగా మారాయని హైడ్రా అధికారులు చెబుతున్నారు.
ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల లేక్‌వ్యూ ప్రాజెక్ట్‌లలో చాలా వరకు బఫర్‌జోన్‌లో లేదా ఎఫ్టీఎల్లో ఉన్నాయా అనేది నిర్ధారించాల్సిన అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తేలడంతో తాజాగా ఎనిమిది మంది అధికారుల పేర్లతో ఒక లిస్ట్ తయారు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని త్వరలోనే రంగనాథ్ సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది.
ఇందులో ఏ చెరువుకు సంబంధించి ఏ అధికారి హద్దుల నిర్ధారణలో అవకతవకలు చేశారనే అంశాన్ని పొందుపరిచి సమగ్ర నివేదిక తయారు చేస్తున్నారు. దీనికోసం ఇద్దరు ఇరిగేషన్ అధికారుల సహకారం తీసుకుని రిపోర్ట్ చేస్తున్నారని తెలిసింది. ఈ ఎనిమిదిమందిలో ముగ్గురు రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నట్లు తెలిసింది. తమ హయాంలో చాలా ప్రాజెక్ట్‌లకు ఎన్ఓసీలు ఇవ్వడంలో ఈ అధికారులు కీలకపాత్ర పోషించారని హైడ్రా, ప్రస్తుత నీటిపారుదల శాఖ అధికారులు తేల్చారు. వీరి విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా హైడ్రా తీసుకెళ్లినట్లు తెలిసింది.