సిటీబ్యూరో/మాదాపూర్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): మేం 30 ఏండ్లుగా ఇదే కాలనీలో ఉంటున్నం. లేఔట్‌లోని సర్వే నంబర్లకు, చెరువు సర్వే నంబర్‌కు ఎక్కడా సంబంధం లేదు. అయినా ఎఫ్టీఎల్ పేరుతో మమ్మల్ని హైడ్రా ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. మేం వయసులో ఉన్నప్పుడు కొన్న ప్లాట్లపై ఇన్నేళ్ల తర్వాత వచ్చి అసలు విషయం తెలుసుకోకుండా చెరువు అభివృద్ధి పేరుతో హైడ్రా సిబ్బంది అరాచకం చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్మైన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇదెక్కడి న్యాయం. ప్రభుత్వం ఈ హైడ్రా విషయంలో సీరియస్‌గా నిర్ణయం తీసుకోవాలి.. ఇది గుట్టలబేగంపేటలోని సియెట్ కాలనీలో ఓ సీనియర్ సిటిజన్ ఆవేదన ఇది.
తాము పైసాపైసా కూడబెట్టి ఎంతో కష్టపడి గుట్టలు లేకుండా చదునుచేసుకుని ప్రభుత్వ అనుమతులతో ఇండ్లు కట్టుకుంటే హైడ్రా వచ్చి మా కాలనీపై విరుచుకుపడుతున్నది. ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వుతూ మా ఇండ్లు కూడా పోతాయని బెదిరిస్తూ ఇన్నేళ్ల నుంచి ఉన్న మాకు నిద్ర పట్టకుండా చేస్తున్నది. హైడ్రా అధికారులకు చెప్పినా వారు వినిపించుకోకుండా మ్యాప్స్‌లో చూస్తున్నామంటూ భయపెడుతున్నారు. మా ఇండ్లు కూల్చేసే అధికారం వారికెక్కడిది. ఈ ప్రభు త్వం హైడ్రాను మధ్యతరగతివారిపై దౌర్జన్యం చేయడానికి పెట్టుకుందా..ఇది అదేకాలనీకి చెందిన ఓ మహిళ ఆందోళన.. మరోసారి హైడ్రా సున్నంచెరువు చుట్టుపక్కల ప్రాంతాలపై విరుచుకుపడుతోంది.
ఇప్పటికే అక్క డ ఉన్న పేదల ఇండ్లు కూల్చే సి అక్కడంతా శిథిలాలమయం చేసిన హైడ్రా అధికారులు.. ఇప్పుడు అక్కడ ఉన్న సియెట్ కాలనీలో గుంతలు తవ్వు తూ వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. మాదాపూర్ సియేట్ కాలనీలో మొత్తం 236 ప్లాట్లు సర్వే నంబర్లు 12,12ఏ,13 లలో ఉన్నాయని, ఇవి కాకుండా మరికొన్ని అప్పట్లో కొందరు నిరుపేదలకు రోడ్లు, పార్కులను కలిపి కొందరు అమ్మేసినట్లు స్థానికులు చెప్పారు. శనివారం గుట్టలబేగంపేటలోని సియేట్కాలనీలో స్థానికులైన రిటైర్డ్ ఉద్యోగులు సున్నం చెరువు పేరుతో తమపై హైడ్రా చేస్తున్న దౌర్జన్యాన్ని విలేకరులకు వివరించారు. 1992లో తాము ఈ కాలనీ స్థాపించామని, అప్పట్లో సున్నంచెరువు కుంటగా ఉండేదని, ఇన్నేళ్లలో ఎప్పుడూ ఒక్క చుక్క నీరు కూడా తమ ఇండ్ల వద్దకు రాలేదని వారు పేర్కొన్నారు.
సున్నం చెరువు విస్తీర్ణం అప్పట్లో పేర్కొన్న ప్రకారం మొత్తం 15.4 ఎకరాలు అయితే హైడ్రా అదికారులు 32 ఎకరాలుగా చెబుతున్నారని, అసలు సున్నం చెరువు ఎఫ్టీఎల్ సర్వేనంబర్ 30 అల్లాపూర్‌లో వస్తుందని.. కానీ అధికారులు మాత్రం మాదాపూర్‌కు వస్తుందని చెబుతున్నారని వారు అన్నారు. 30 ఏండ్లుగా అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతో నిర్మాణాలు చేసుకునే ఉంటున్నామని, ఉన్నట్లుండి ఇప్పుడు ఈ ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని తమను ఖాళీ చేసి వెళ్లి పొమ్మంటున్నారని సీనియర్ సిటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు.
లేఔట్ ప్రకారం సియేట్ కాలనీలోని సున్నం చెరువుకు హైటెన్షన్ లైన్ నుంచి అల్లాపూర్ వరకు 80 ఫీట్ల రహదారిని వదిలేసి, పార్కు కోసం రెండెకరాల స్థలాన్ని ఇవ్వడం జరిగిందని, అన్నీ సరిగా ఉన్నప్పటికీ అప్పట్లో లేఔట్ పర్మిషన్ సంబంధించి కేవలం రూ.105 చెల్లించలేదని తమకు పర్మిషన్ క్యాన్సిల్ చేసినట్లు అధికారులు ఆర్టీఐలో సమాధానమిచ్చారని వారు తెలిపారు. 2013లో డ్రాఫ్ట్ సర్వే పేరిట తప్పుడు సర్వే చేసినట్లు రిపోర్ట్ ఉండడంతో తాము అందులో తప్పులు గుర్తించి అధికారులకు తెలపగా విజిలెన్స్ మరోసారి సర్వే చేయాలంటూ ప్రభుత్వానికి సూచించారని, అయినా సర్వే జరగడం లేదన్నారు. తమ ప్లాట్లలో 183 ప్లాట్లకు ఎన్ఓసీ ఇచ్చారని, ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటూ తమను ఖాళీ చేయమంటున్నారని తెలిపారు.
నావయసు 82 ఏళ్లు. రిటైర్మెంట్కు ముందు ఈ ప్లాట్ తీసుకున్నాను. నాకు ఇక్కడ పరిస్థితులపై పూర్తి అవగాహన లేదు. పూర్తి అనుమతులతో మేం కాలనీ ఏర్పాటు చేసుకున్నాం. అయితే హైడ్రా వచ్చి మమ్మల్ని బెదిరిస్తుంటే మేం అన్ని డాక్యుమెంట్లు తీసుకుని హైడ్రా ఆఫీసుకు వెళ్లాను. నా వయసుకు కూడా గౌరవమివ్వకుండా హైడ్రా కమిషనర్ సాయంత్రం వరకు వెయిట్ చేయించి చివరకు మా మాట వినకుండానే నాకు మీటింగ్ ఉంది.. తర్వాత చూద్దాం అంటూ వెళ్లిపోయారు.
అసలు ఈ డాక్యుమెంట్ల కోసం ఎందుకు తిరుగుతున్నారు.. మీకు మంచి సహకారం అందేలా చూస్తాం అక్కడి నుంచి వెళ్లిపోండని హైడ్రా వాళ్లు చెప్తున్నారు. మేం కష్టపడి కట్టుకున్న ఇండ్లు వదిలేసి ఎలా పోవాలి. మా పిల్లలకోసం గూడు ఏర్పాటు చేసుకుంటే ఈ వయసులో మమ్మల్ని కష్టపెడుతున్నారు మీకు న్యాయమేనా.. అసలు ప్రభుత్వం హైడ్రాను ముందరపెట్టి ఏం చేస్తోంది. పెద్దోళ్లను వదిలి మాలాంటి ముసలోళ్లపై దౌర్జన్యాలు చేయిస్తుందా.
– శివశంకర్‌రావు, రిటైర్డ్ ఇంజినీర్
మాకు న్యాయం చేయాలంటూ మేం కోర్టుకు వెళ్తే వారు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా ఇక్కడంతా గుంతలు తవ్వుతున్నారు. మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు. కోర్టునే పట్టించుకోకపోతే మేం ఎవరి దగ్గరకు వెళ్లాలి. అసలు ఇక్కడ ఏ సర్వే నంబర్ వరకు ఎఫ్టీఎల్ వస్తుందని వారికైనా తెలుసా. ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా ఒక్కచుక్క నీరు మా ఇండ్లకు రాలేదు. హైదరాబాద్‌లో పెద్ద పెద్ద వర్షాలు పడినా ఊరంతా మునిగినా మా దగ్గరకు నీళ్లే రాలేదు. ఇది బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ ఎలా అవుతుంది.
మేం చెప్పినప్పటికీ వాళ్లు నమ్మడం లేదు. అంతేకాకుండా ఇక్కడినుంచి వెళ్లిపోవాలంటూ భయపెడుతున్నారు. ఇలా దౌర్జన్యంగా ఖాళీ చేయిస్తే మేం ఊరుకునేదే లేదు. ఎక్కడికైనా వెళ్తాం. ఎంతదూరమైనా కొట్లాడుతాం. మేమేం కబ్జాదారులం కాదు. రిటైర్డ్ ఉద్యోగులం. మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలను అందులోనూ సీనియర్ సిటిజన్లను వేధించడం కరెక్టేనా ఒకసారి అధికారులు ఆలోచించాలి. – రాధ, స్థానికురాలు
నేను బిల్డింగ్ కట్టేటప్పుడు హైడ్రా వచ్చి కూల్చేసింది. నోటీసు ఇవ్వకుండానే కూలగొట్టారు. హైడ్రా ఆఫీసుకు వెళ్తే నువ్వు ముందేవచ్చి ఎందుకు కలవలేదు అని అడిగారు. మాకు ఏ పార్టీలతో సంబంధం లేకున్నా ఇంటెలిజెన్స్ వర్గాలు సియేట్ కాలనీలో వేరే పార్టీలు వస్తున్నారని చెప్పారని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని హైడ్రా వాళ్లు చెప్పారు. ఇదేం పరిస్థితిరా దేవుడా.. మాకు న్యాయం చేయమని హైడ్రావాళ్లను అడిగితే చూద్దాం చేద్దాం అంటూ తిప్పుకున్నారు.
చివరకు కోర్టుకు వెళ్తే బౌండరీలు ఫిక్స్ చేయమని కోర్టు చెప్పినా వినకుండా మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు. అసలు గత సంవత్సరం సెప్టెంబర్‌లో విల్లాలలో ఉన్నవారికి నోటీసులు మాత్రమే ఇచ్చారు వాళ్ల ఇల్లు కూలగొట్టలేదు. మా ఇల్లు కూలగొట్టేటప్పుడు మాత్రం ఇవ్వలేదు. మేం కబ్జాదారులం కాదు.ఎన్జీటీ రిపోర్ట్‌లో చెరువు విస్తీర్ణం ఒకలా ఉంటే హైడ్రా మరోలా చెబుతోంది.
– నాగేంద్రకుమార్, సివిల్ ఇంజినీర్