నగరంలో శుక్రవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ఒక్కసారిగా వరద నీరు పైగా కాలనీని ముంచెత్తింది. అయితే పైగా కాలనీ మునిగిపోవడానికి కారణం హైడ్రానే అంటూ కాలనీ వాసులు మండిపడుతున్నారు. బేగంపేటలోని రసూల్‌పుర వద్ద పైగాకాలనీలోకి వరదనీరు వెల్లువెత్తింది. సుమారుగా 50 కుటుంబాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. నాలాపై ఆక్రమణలు ఉన్నాయంటూ గత నెల 6న ఉదయం ఆరుగంటలకు తమ కాలనీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని, ఆ కూల్చివేతల వల్లే ఇప్పుడు కాలనీలోకి భారీగా నీరు చేరిందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ కాలనీలోకి వరద రాలేదని, ఎప్పుడైనా చాలా వర్షం పడితే చిన్నచిన్నగా నీళ్లు వచ్చేవని, ఇంత భారీ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి అని వారు చెప్పారు. ముఖ్యంగా తమ కాలనీలోకి నాలా పొంగి వచ్చే వరద రాకుండా ఉన్న అడ్డుగోడను అక్రమ నిర్మాణం పేరుతో కూల్చేసిందంటూ హైడ్రా చర్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ కాలనీలో వరద ముంచెత్తడానికి హైడ్రా అక్కడ రిటైనింగ్ వాల్ కూల్చేయడమే కారణం కాగా, ఇందుకు కంటోన్మెంట్ బోర్డు సభ్యులు కూడా సహకరించడంపై పాట్నీనగర్ వాసులంతా మండిపడుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్‌ను స్థానికులు ఘెరావ్ చేశారు. తమ అనుమతిలేకుండా, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా హైడ్రా ఈ రిటైనింగ్ వాల్ ఎలా కూలగొడ్తుందంటూ వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఈవో మధుకర్‌నాయక్ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. నాలాపై ఆక్రమణలు తొలగించి తిరిగి రిటైనింగ్ వాల్ కట్టడానికి హైడ్రా పనిచేస్తున్నదని, కొన్ని కుటుంబాలు కోర్టుకు వెళ్లడం వల్ల నిర్మాణాలు ఆగిపోయాయని చెప్పారు.
తాత్కాలికంగా రిటైనింగ్ వాల్..!
సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా వరద నివాస ప్రాంతాల్లోకి రాకుండా తాత్కాలికంగా ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. హైడ్రా గత నెల 6న ఈ నాలా విస్తరణ పనులు చేపట్టింది. ఇందులో కబ్జా అంటూ అక్కడ ఉన్న వాల్‌ను తొలగించింది. పైన ఉన్న కాలనీలు వరద ముంపునకు గురికాకుండా ఉండడానికే ఈ రిటైనింగ్ వాల్ తొలగిస్తున్నామని హైడ్రా అధికారులు చెప్పినా.. అసలు వరద వస్తే రసూల్‌పుర, పైగా కాలనీ మొత్తం మునకకు గురవుతుందంటూ స్థానికులు అప్పట్లో తమ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయినా వారి మాటలను పట్టించుకోని హైడ్రా.. గోడను కూల్చేసింది. తర్వాత ఒకట్రెండు చిన్నపాటి వర్షాలు కురిసినప్పటికీ పెద్దగా నీళ్లు రాలేదు. కానీ శుక్రవారం కురిసిన వర్షానికి వరదనీరు పైగాకాలనీని ముంచెత్తింది. కాలనీలో ఓ కుటుంబం కోర్టుకు వెళ్లడంతోనే తాము విస్తరణ పనులు చేయలేదని హైడ్రా చెబుతున్నా.. ఈ పరిస్థితులకు మాత్రం హైడ్రానే కారణమని పైగా కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా కాలనీ మునిగిపోయి స్థానికులంతా వరదనీటిలో చిక్కుకున్నప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా బోట్లో వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అయితే ఇక్కడ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి రిటైనింగ్ వాల్ కట్టలేకపోయామంటూ హైడ్రా అధికారులు చెప్పారు. హైడ్రా ఈ విషయం చెప్పడం విడ్డూరంగా ఉందని పైగా కాలనీ వాసులు అంటున్నారు.
హైడ్రాపై నెటిజన్ల ఫైర్
హైడ్రాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్ చెరువులతో పాటు నగరంలో వర్షం పనులనూ హైడ్రాకే అప్పగించడం కారణంగా ఒత్తిడి పెరిగి ఏ పని చక్కగా చేయలేకపోతున్నదన్న విమర్శ లేకపోలేదు. నగరానికి వరద ముప్పు లేకుండా చేస్తుందంటూ హైడ్రాను నమ్మి నాలాల సంగతి కూడా చూస్తారంటూ జీహెచ్ఎంసీ నుంచి ఇచ్చేసిన రేవంత్‌కు హైదరాబాద్‌లో వరద ముంచెత్తిన తీరు షాకిచ్చిందో లేదో తెలియదు కానీ నగరవాసులు మాత్రం హైడ్రా పనితీరుపై విరుచుకుపడుతున్నారు.
ఇతర శాఖలతో సమన్వయలోపం..
నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించడానికే హైడ్రాను తీసుకొచ్చామంటూ రేవంత్‌రెడ్డి హైడ్రా పోలీస్‌స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రకటించినా ఆయన నమ్మకానికి హైడ్రా తూట్లు పొడిచింది. వరద నీటి నిర్వహణతో పాటు నగరంలో వరదలు వస్తే ఎలా పనిచేయాలనే విషయంలో హైడ్రాకు అనుభవం లేని సందర్భంలో వాటిపై అనుభవం ఉన్న శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు పోవాలి. కానీ ఈ విషయంలో హైడ్రా తీరును ఇతర శాఖలు నిరసిస్తున్నారనడానికి శుక్రవారం వర్షానికి జనాలు ఇబ్బందిపడుతున్నా.. రోడ్డుపై జీహెచ్ఎంసీ సిబ్బంది కనిపించకపోవడమే నిదర్శనమని నగరవాసులు అంటున్నారు. అంతర్గతంగా హైడ్రా, మున్సిపల్ శాఖల సిబ్బంది పరస్పరం సహకరించుకోకపోవడం, ఆధిపత్యధోరణి కారణంగా నగరాన్ని వరద ముంచెత్తింది. వరద నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమైందన్న విమర్శలు వచ్చాయి. ప్రధానంగా నెటిజన్లు తమ ప్రాంతాల్లో పరిస్థితిని ఫొటోలు, వీడియోల ద్వారా షేర్ చేస్తూ హైడ్రాను విమర్శించారు. ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టా వేదికలుగా సిటీజనాలు ఫైరయ్యారు.
పెత్తనం చెలాయించడమే కారణమా..!
హైడ్రా మొదటిసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత వర్షాల తీవ్రతపై సరైన అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. అంతేకాకుండా ఆ సంస్థలో సరిపడా ఉద్యోగులు, అధికారులు లేకపోవడంతో వరద నీటి నిర్వహణ పనులపై ప్రభావం చూపింది. ఎక్కడ రహదారులపై భారీగా వరదనీరు నిల్వ ఉంటుంది.. ఏ ప్రాంతాల్లో వర్షం పడితే ఎక్కడ నీళ్లు నిలుస్తాయనే విషయంలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవడంలో హైడ్రా విఫలమైంది. రోడ్లు, ఫ్లై ఓవర్లపై వరదనీరు వెళ్లే డ్రైన్ ఔట్లెట్లకు జిహెచ్ఎంసి కనీస మరమ్మతులు చేపట్టకపోవడం, అందులోని చెత్త తొలగించకపోవడంతో రోడ్లు, ఫ్లై ఓవర్లపై భారీగా వరదనీరు చేరింది.
ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి కూడా అధికారులతో మాట్లాడినట్లు హైడ్రా కమిషనర్ ఫొటోలు సోషల్ మీడియాలో తిప్పినప్పటికీ ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు కావడంతో ప్రజలు మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు తమ పరిధిలో ఉన్న వార్డుల్లో, సర్కిళ్లల్లో సీరియస్‌గా వర్క్ చేయకపోవడం మూలాన పలు కాలనీల్లో వరదనీరు ముంచెత్తిందని హైడ్రా చెప్పినా.. తమ బాధ్యతలు కూడా వారే తీసుకుని చేస్తామని ప్రగల్భాలు పలికారు కదా.. అంటూ కార్పొరేషన్ సిబ్బంది ఎద్దేవా చేస్తున్నారు. అయితే మీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తే వారి నుంచి ఒకటే సమాధానం వస్తోంది.. తాము హైడ్రాతో కలిసి పనిచేసే క్రమంలో హైడ్రా సిబ్బంది తమపై ఆజమాయిషి చేస్తూ ఆర్డర్లు ఇస్తున్నారని, మాతో పాటు వారు కూడా పనుల్లో పాలుపంచుకుంటే కలిసి పనిచేస్తాం కానీ..తమపై పెత్తనం చెలాయించడానికి వారెవరంటూ ప్రశ్నిస్తున్నారు.
అంతా హైడ్రా అన్నారు.. నిండా ముంచారు..!
నాలాలు మొత్తం మేమే చేస్తామని హైడ్రా చెప్పుకుని జీహెచ్ఎంసీ నుంచి బాధ్యతలు తీసుకుంది. నాలాల్లో చెత్త తొలగించడంలో బల్దియా అవినీతికి పాల్పడిందని, నగరానికి వరద ముప్పు లేకుండా చేయాలంటే తాము తమ టీమ్స్‌తో చేయగలమంటూ హైడ్రా అత్యుత్సాహం ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌ను తామే సమన్వయం చేస్తామంటూ వారి విధులను కూడా నిర్దేశించి బాధ్యతలలోకి తీసుకుంది. వర్షాకాలంలో సిటీలో భారీగా వర్షం కురిస్తే వరద ముంచెత్తితే ఎలా సహాయక చర్యల్లో పాల్గొనాలో చెప్పిన తర్వాత వారంతా విధుల్లో చేరారంటూ ఇటీవల హైడ్రా కమిషనర్ ప్రకటన చేశారు.
అయితే ఈ మాన్సూన్ టీమ్స్‌ను మొదటి నుంచి సమన్వయం చేసే జీహెచ్ఎంసీతో కో ఆర్డినేషన్‌తో ముందుకుపోకపోవడంతో ఈ రెండురోజుల్లో కురిసిన వర్షానికి నగరానికి వరద ముప్పు తప్పలేదు. ప్రధానంగా హైడ్రాకు ఉన్న అనుభవరాహిత్యం, ఇతర శాఖలతో తాను కో ఆర్డినేట్ చేసుకుంటానంటూ పైకి చెబుతున్నా తన మాటే వినాలంటూ చెప్పే విధానంపై ఇతర శాఖల ముఖ్య అధికారులు గుర్రుగా ఉన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు వర్షాకాలంలో పనులను హైడ్రాకు అప్పగించడంపై నిరసన వ్యక్తం చేశారు.
బీజేపీ చెందిన ఒక కార్పొరేటర్ ఈ విషయంలో వినూత్న నిరసన తెలిపి ఇంత పెద్ద సిటీలో వరద ముప్పు నివారించే చర్యలను హైడ్రాకు అప్పగించడాన్ని తప్పుబట్టారు. గత కొన్నిరోజులుగా చిన్నపాటి వర్షాలు మాత్రమే ఉన్నాయని, గట్టిగా వాన పడితే హైడ్రా చేతులెత్తేయడం ఖాయమని ఆరోజు కార్పొరేటర్లు అన్న మాట ఇప్పుడు నిజమైంది. కార్పొరేటర్లు నగరంలో పరిస్థితులపై హైడ్రాకు అవగాహన ఉండదని, ఈ విషయంలో జీహెచ్ఎంసీని వదిలేసి హైడ్రాకు బాధ్యతలు అప్పగించడం కరెక్ట్ కాదని ఎంతగా మొత్తుకున్నా.. కాంగ్రెస్ సర్కార్ ఈ విషయాన్ని పెడచెవిన పెట్టింది. కార్పొరేషన్ ముఖ్య నేతలు, అధికారులు కూడా హైడ్రా పనితీరుపై గుర్రుగా ఉన్నారు.