బంజారాహిల్స్, అక్టోబర్ 8: బంజారాహిల్స్ రోడ్ నం.10 లోని జలమండలి పక్కనున్న ఐదెకరాల ప్రభుత్వ స్థలంలో పలుమార్లు ఆక్రమణలకు ప్రయత్నాలు జరుగుతున్న వ్యవహారంపై బుధవారం హైడ్రా అధికారులు పరిశీలన చేపట్టారు. సుమారు రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు పలువురు యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలు క్రిమినల్ కేసులు నమోదవ్వడంతో పాటు కోర్టుల్లో సైతం స్టేలు ఉన్నాయి.
అయినా కొంత మంది స్థలంలోకి ప్రవేశించి అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు తుడిచివేయడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రెండ్రోజుల కిందట రెవెన్యూ అధికారులు వచ్చి వెళ్లిన తర్వాత మరోసారి బోర్డులు తుడిచివేయడంతో పాటు జలమండలికి చెందిన స్థలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇద్దరు వ్యక్తులను ఉంచారని హైడ్రా అధికారులు గుర్తించారు. అక్కడున్న వాచ్మెన్లను పోలీసులకు అప్పగించి సీసీ కెమెరాలు తొలగించారు.
కోర్టులో స్టేలు ఉన్న సమయంలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన వాచ్మెన్లు స్థలంలోకి ప్రవేశించడం, అక్కడ వేటకుక్కలతో నిరంతరం పహారా కాయడంపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో పరిశీలన కోసం వచ్చామని హైడ్రా ఏసీపీ తిరుమల్ తెలిపారు. ఈ కబ్జాల వ్యవహారానికి శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలో రెండుమూడురోజుల్లో రెవెన్యూ, జలమండలి, పోలీసులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి విజిలెన్స్ డీసీపీ, హైడ్రా ఇన్స్పెక్టర్ నర్సింహారావు, జలమండలి జీఎం ప్రభాకర్, మేనేజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.