హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా.. హైడ్రా అధికారుల్లో మార్పు రావ డం లేదు. హైదరాబాద్‌పై హైడ్రా మరోసారి రంకలేసింది. నోటీసులు ఇవ్వకుండా.. సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టవద్దనే న్యాయస్థానం ఆదేశాలను హైడ్రా బేఖాతరు చేస్తున్నది. వీకెండ్లో కూ ల్చివేతలు చేపట్టవద్దని హైకోర్టు ఇటీవల స్పష్టంగా పేర్కొన్నది. కానీ, హైడ్రా అధికారులు అవేం పాటించకుండా ఆక్రమణల పేరిట ఇష్టారాజ్యంగా కూల్చివేతలకు పాల్పడ్డారు.
జీహెచ్ఎంసీ అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని ఐలాపూర్‌లో వీకెండ్ చూసుకొని.. శనివారం రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా కొందరిని లక్ష్యంగా చేసుకొని ఈ చర్యలు చేపట్టింది. ఉదయం 6 గంటల నుంచి అపార్ట్మెంట్లో ఉన్నవారికి ఖాళీ చేయించి.. నివా సితులకు నరకం చూపించారు. కట్టుబట్టలతో మూటముల్లె సర్దుకొని..పిల్లాపాపాలతో తలోదారిన వెళ్లిపోయారు. ఇది చూపరులకు కంటతడి పెట్టించింది. కాగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుని హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టినట్లు బాధితులు ఆరోపించారు. – అమీన్పూర్/ సిటీ బ్యూరో
అమీన్పూర్, ఏప్రిల్ 11 : సంగారెడ్డి జిల్లాలో జీహెచ్ఎంసీ అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని ఐలాపూర్‌లో హైడ్రా అధికారులు శనివారం రెవెన్యూ అధికారులతో కలిసి కూల్చివేతలు చేపట్టారు. ఐలాపూర్ పరిధిలోని ఒకటి నుంచి 220 సర్వేనంబర్లలో 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు ఇండ్లు నిర్మించుకున్నారు. ఇండ్లు నిర్మించుకున్న తర్వాత మరో 860 ఎకరాల ప్రభుత్వభూమి అందుబాటులో ఉంది. ఈ భూమిని కాపాడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నివాసాల జోలికి వెళ్లకుండా తాజాగా చేపట్టిన పలు నిర్మాణాలను అధికారులు కూల్చివేయించారు. 1998 నుంచి కోర్టు ఆర్డర్లు ఉన్నా, ఐలాపూర్‌లో స్థానికంగా ఉన్న ముఖీమ్ అనే వ్యక్తి గెస్ట్‌హౌస్ నిర్మించారని తెలుపుతూ అధికారులు గెస్ట్‌హౌస్‌ను పూర్తిస్థాయిలో నేలమట్టం చేశారు.

దీంతో పాటు ముఖీమ్ సోదరుడు అజీమ్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించారని ఆరోపిస్తూ అధికారులు ఈ భవనం కూల్చివేతకు చర్యలు చేపట్టారు. ఆరంతస్తుల భవనంలో నలభై కుటుంబాలు అద్దెకు ఉంటూ జీవనాన్ని సాగిస్తున్నాయి.శనివారం ఉదయం 6 గంటలకు అధికారులు ఫ్లాట్లలోకి చొరబడి తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇంటి తలుపులు తీయకపోవడంతో హైడ్రా సిబ్బంది నిర్ధ్దాక్ష్యిణంగా ఇంటి కిటికీలు పగులగొట్టి బయటకు రావాలని ఆదేశించారు. దీంతో బిక్కుబిక్కు మంటు ఫ్లాట్లలో నివాసముంటున్న వారు బయటకు రావడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. చిన్నారులు, వృద్ధ్దులు, ఇంట్లోని వస్తువులను బయటకు తీసుకువచ్చేందుకు అద్దెకు ఉంటున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఐదో అంతస్తు నుంచి వస్తువులను కిందికి పడేశారు. కేవలం 2 గంటలే సమయం ఇవ్వడంతో కిరాయిదారులు హుటాహుటిన వారి వస్తువులను బయటకు తీసుకువచ్చేందుకు నానా ఇబ్బంది పడ్డారు. తమకు సమయం ఇవ్వకుండా తెల్లవారు జామునే ఫ్లాట్లను ఖాళీ చేయమని అధికారులు చెప్పడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తిండీతిప్పలు లేకుండా కిరాయిదారులు వారి ఫ్లాట్లను ఖాళీ చేశారు. అనంతరం అధికారులు ఆరంతస్తుల భవనాన్ని కూల్చివేసే చర్యలు ప్రారంభించారు.

బీఆర్ఎస్ నేత ఐలాపుర్ మాణిక్‌యాదవ్ కార్యాలయాన్ని కూడా అధికారులు కూల్చివేయించారు. ప్రభుత్వ భూమిలో ఫాంహౌస్ , బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టారని ఆరోపిస్తూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఫాంహౌస్‌లోని ప్రహరీతో పాటు భవనాన్ని కూల్చివేయించారు. కూల్చివేతలను మాణిక్యాదవ్తో పాటు కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, మాణిక్‌యాదవ్ కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. తొలి సీఎం కేసీఆర్‌తో దిగిన ఫొటోతో బయటకు వచ్చిన మాణిక్‌యాదవ్ రోధిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాతల కాలం నుంచి ఈ భూమిలో తాము నివాసం ఉంటున్నామన్నారు. కోర్టు పరిధిలో ఈ స్థలం వివాదంలో ఉందన్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు విచక్షణా రహితంగా కూల్చివేతలు చేయడం సరైంది కాదన్నారు. కేసీఆర్ పాలనలో ఇలా జరగలేదని, ఈ విషయమై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు టార్గెట్ చేస్తూ, హైడ్రాను అడ్డంపెట్టుకోని ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మాణిక్‌యాదవ్ ఆరోపించారు.

శనివారం ఉదయం 6 గంటల నుంచి హైడ్రా, పోలీసులు భారీగా మోహరించారు. 300 మంది వరకు హైడ్రా, పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పోలీసులు ఒక్కసారిగా ఐలాపూర్‌కు చేరుకోవడంతో సమీపంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హైడ్రా ఎస్పీ సుదర్శన్, సీఐ బాలగోపాల్‌తో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు భారీ సంఖ్యలో ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐలు నరేష్, రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ఐలాపూర్‌లో పోలీసులు, అధికారులు హై డ్రామా చేశారు.
అపార్టుమెంట్‌లోని ప్లాటులో ఎనిమిది నెలలుగా అద్దెకు ఉంటున్నాం. రెండు నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చాం. ఉన్న ఫలంగా ఫ్లాట్ ఖాళీచేయమని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాం. యజమానికి ఫోన్ చేస్తే స్పందన లేదు. హైడ్రా అధికారులు మాకు సహకారం అందించక పోవడంతో నాలుగో ఫ్లోర్ నుంచి వస్తువులను కిందికి దింపడం ఇబ్బందిగా మారింది.
-పాల్, కిరాయిదారు
207 ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్న వారు ఆఫీస్ పని నిమిత్తం వారం క్రితం ఆస్టేలియాకు వెళ్లారు. ఫ్ల్లాట్ను కూల్చివేస్తున్నారనే సమాచారం తెలియడంతో వారి ప్లాట్‌ను ఖాళీ చేయించేందుకు మేము వచ్చాం. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అధికారులు ఇలా కూల్చి వేయించడం సరైంది కాదు. ముందుస్తుగా నోటీసులు ఇచ్చి వ్యవహరిస్తే బాగుండేది.
-హారిక, పక్క అపార్టుమెంట్ మహిళ