HYDRA | సిటీబ్యూరో/బండ్లగూడ, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో వరుస దాడులతో అక్రమ నిర్మాణాలు, కబ్జాలను తొలగిస్తున్నారు. శనివారం సైతం రాజేంద్రనగర్ సర్కిల్లోని బూమ్రుఖుద్దీన్ దవాళ్ చెరువు, చందానగర్ ప్రాంతంలోని ఎర్ర చెరువు బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు.
దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బూమ్రుఖుద్దీన్ దవాళ్ చెరువులో అధికారుల నిర్లక్ష్యంతో బఫర్ జోన్లలో నిర్మాణాలు జోరందుకున్నాయి. దాదాపు 10 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. మొత్తం 20 ప్రహరీలు, 6 నిర్మాణాలను పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. బహదూర్పురా ఎమ్మెల్యే ముబిన్ కూల్చివేతలను నిలిపివేయాలని హైడ్రా సిబ్బందిని అడ్డుకోగా, పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
చెరువులు ఆక్రమిస్తే కఠిన చర్యలు
ట్రై సిటీ పరిధిలో చెరువులకు సంబంధించిన బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో రియల్టర్లు, బిల్డర్ల నిర్మాణాలు అక్రమమని తేలితే చట్టపరంగా కూల్చివేస్తాం. వారికి సహకరించే అధికారులపై కూడా చర్యలుంటాయి. చెరువులు, కుంటల సమీపంలో స్థిరాస్తులను కొనుగోలు చేసే ముందు ఓ సారి హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది.
– రంగనాథ్, హైడ్రా కమిషనర్