HYDRAA | బంజారాహిల్స్,జనవరి 4: జూబ్లీహిల్స్ డివిజన్ గురుబ్రహ్మనగర్‌లో మరోసారి హైడ్రా అధికారుల కలకలం చెలరేగింది. నందగిరిహిల్స్ కాలనీకి చెందిన పార్కు స్థలం అంటూ సుమారు 1500 గజాల స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేస్తుండటంతో బస్తీవాసులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ నందగిరిహిల్స్‌ను ఆనుకుని ఉన్న గురుబ్రహ్మనగర్ బస్తీవాసులకు, నందగరి హిల్స్ సొసైటీకి మధ్యన ఉన్న ఖాళీ స్థలం విషయంలో చాలాకాలంగా వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానికంగా పర్యటించి నందగిరిహిల్స్ సొసైటీ వాసులకు మద్దతుగా పార్కు స్థలం అంటూ పేదల గుడిసెలకు అడ్డుగా ఫెన్సింగ్ నిర్మించేందుకు కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
బస్తీవాసులు ఆందోళనకు దిగడంతో పాటు తమకు దారిలేకుండా ఎలా చేస్తారంటూ ఫెన్సింగ్‌ను కూల్చేయడంతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్, హైడ్రా కమిషనర్ మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. చెరువుల సంరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా పేదల బస్తీల జోలికి ఎలా వస్తుందంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అప్పట్లో వెనక్కి తగ్గారు. శుక్రవారం సాయంత్రం నుంచి గురుబ్రహ్మనగర్ను ఆనుకుని ఉన్న సుమారు 1500 గజాల స్థలంలో ప్రహరీ నిర్మాణం కోసం నందగిరిహిల్స్ సొసైటీ పనులు ప్రారంభించడంతో మరోసారి ఈ వ్యవహారంలో వివాదం రాజుకుంది.
జీహెచ్ఎంసీతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులు ప్రహరీ నిర్మాణం చేస్తున్నారని, స్థానికంగా నివాసం ఉంటున్న బసవరాజు అనే వ్యక్తి ప్రోద్భలంతో హైడ్రా అధికారులు తమను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ బస్తీవాసులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం మధ్యాహ్నం ఫిలింనగర్ 18బస్తీల అధ్యక్షుడు మామిడి నర్సింగరావు నాయకత్వంలో బస్తీ అధ్యక్షుడు గోపాల్ నాయక్, రాంచందర్, రవినాయక్ తదితరులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిశారు. ఇండ్లు కట్టకముందే తమ గుడిసెల చుట్టూ ప్రహరీలు నిర్మిస్తే ఊరుకునేదిలేదని బస్తీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ తెలిపారు. సుమారు 300 ఎస్టీ,ఎస్సీ కుటుంబాలు ఇక్కడ 30ఏళ్లుగా నివాసం ఉంటున్నాయని, వారికి ఇబ్బందులు కలిగిస్తే మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి ఉంటుందని మామిడి నర్సింగరావు హెచ్చరించారు.