సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు హైడ్రా కసరత్తు ప్రారంభించింది. నగరంలోని ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలపై దృష్టిపెట్టింది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతో పాటు హైడ్రా ట్రాఫిక్ వలంటీర్లు కూడా పనిచేస్తారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే దిశగా హైడ్రా ట్రాఫిక్ వలంటీర్ల పేరుతో డీఆర్ఎఫ్ సిబ్బందికి ట్రాఫిక్ నియంత్రణపై శిక్షణ ఇప్పించారు. బుధవారం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా హైడ్రా వలంటీర్లు విధులు నిర్వహించారు. గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్సెంటర్లో 50 మంది హైడ్రా బృందానికి శిక్షణ ఇచ్చారు. అనంతరం వలంటీర్లు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పనిచేశారు. ట్రాఫిక్‌ను నియంత్రించడం, సిగ్నల్స్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో వాహనాలు నిలువకుండా సాఫీగా వెళ్లేలా చూశారు.