సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): విశ్వనగరం చినుకుపడితే చిగురుటాకులా వణికిపోతున్నది. మోస్తరు వర్షం కురిసినా కాలనీలు, రహదారులు జలమయమవుతున్నాయి. గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రహదారుల్లో నీరు ఏరులై పారుతున్నది.
మురుగు నీటి నాలాలు పొంగిపొర్లుతున్నాయి. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమవ్వడంతో గతేడాది కంటే నీటి నిల్వ ప్రాంతాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా నీరు రోజుల తరబడి నిల్వ ఉండి కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. దోమలు, సూక్ష్మజీవులు చేరి నగర ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఓపీల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.
ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన సర్వేలో 436 ప్రాంతాల్లో రహదారులు మునిగిపోతున్నట్లు తేలింది. గ్రేటర్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఏటా పెరుగుతున్నా పరిష్కరించడంలో జీహెచ్ఎంసీ తీవ్రంగా విఫలమవుతున్నదని నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి హైడ్రా కూడా బాధ్యతలు తీసుకున్నా ఎలాంటి మార్పు లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నా సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపడంలేదని విమర్శిస్తున్నారు.
ఇన్నాళ్లుగా అధికారులకు కనిపించలేదా?
గ్రేటర్ పరిధిలో వర్షాకాలంలో 141 చోట్లనే నీరు నిల్వ ఉంటుందని జీహెచ్ఎంసీ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. హైడ్రా వాటి సంఖ్యను పెంచి 160కి పైగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పుడు హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ ఫోలీసుల సర్వేలో ఏకంగా 436 ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంటుందని తేలింది. దీన్ని బట్టి చూస్తే అధికారుల పనితీరు ఎంత బాగుందో తేటతెల్లమవుతున్నది.
గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖకు ప్రత్యేకంగా మంత్రి ఉండటంతో వర్షాకాలానికి ముందస్తు చర్యలకు సంబంధించిన ప్రత్యేక ప్రణాళిక ఉండేది. ప్రస్తుతం ఆ శాఖను సీఎం అట్టిపెట్టుకోవడంతో పాటు బల్దియా అధికారులకు చెప్పేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో వర్షం పడితే ఎప్పుడు ఏ కాలనీ మునిగిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
తనిఖీలు శూన్యం..
గ్రేటర్లో నీరు రోజుల తరబడి నిల్వ ఉన్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదని నగర ప్రజలు మండిపడుతున్నారు. కాలుష్య నియంత్రణ అధికారులు పట్టించుకోకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వర్షాకాలంలో పీసీబీ అధికారులు అప్రమత్తంగా ఉండి వాటర్ లాగింగ్ ప్రాంతాలు, నాలాల్లోని నీటిని పరీక్షించాల్సి ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలను ఇష్టానుసారంగా నాలాల్లోకి విడుదల చేస్తున్నారు.
ఆ పరిశ్రమల వ్యర్థాలు నాలాలు, కాలనీల్లోని నీరు నిల్వ ఉన్న ప్రాంతాలకు చేరి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. దీన్ని అరికట్టడానికి పీసీబీ అధికారులు నిరంతర తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఆ పరిశ్రమల వ్యర్థాలను వదలకుండా అరికట్టాల్సి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికైనా నీటి నిల్వ ప్రాంతాల్లో నివారణ చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలం మరో రెండు నెలలు ఉండటంతో ఇప్పటి నుంచి నగరంలోని నీటి నిల్వ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.