HYDRA Demolition | మేడ్చల్, మే 22 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ పరిధిలో గురువారం హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీసింది. ఎలాంటి సమాచారం అందించకుండా బాధితులు ఎంతగా వేడుకున్నా.. సమయం ఇవ్వాలని కోరినా..కనికరించకుండా అనుమతులు ఉన్న ఐదు నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో పాటు తమ ఊర్లలో ఉన్న భూములను అమ్మితే వచ్చిన డబ్బులతో స్థలం కొనుగోలు చేసుకుని నిర్మాణాలు చేసుకుంటే హైడ్రా పేరిట తమ జీవితాలను రోడ్డున పడవేశారని బాధితులు ఆరోపించారు. కేసీఆర్ పాలననే బాగుండేనని చెప్పిన బాధితులు.. కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తిపోశారు. రేవంత్‌రెడ్డికి ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.
రోడ్డున పడేస్తున్నారు
-బాధితుడు మధుసూదన్‌రెడ్డి
హైడ్రా పేరుతో రోడ్డున పడేస్తున్నారు. కష్టపడి సంపాందిచి కోనుకున్న స్థలంలో నిర్మించిన ఇంటిని కూల్చివేయడం అన్యాయం. ఇంటి అనుమతులు ఉన్నా.. కూల్చివేస్తున్నారు ఎందుకు. పేదలను కష్టపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదు. నిర్మాణాన్ని కూల్చివేస్తుంటే అడ్డుకుంటే నాపై దౌర్జన్యం చేశారు. పేదల కష్టాలు కాంగ్రెస్ పట్టావా మా జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్‌కు మా ఉసురు తప్పదు
నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తారా..
-బాధితుడు అలేటి రజనీకాంత్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి పేదవాళ్లను బెదిరించి పెద్దవాళ్ల వద్ద వసూళ్లు చేసుకుంటున్నారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తారా.? ఉదయం 5 గంటల ప్రాంతంలో వచ్చి ఎలాంటి సమాచారం అందించకుండా కూల్చివేతలు ప్రారంభించారు. నా నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్న క్రమంలో ఐదేండ్లుగా ఇంటి పన్నులు కూడా చెల్లిస్తున్నాం. కరెంట్ బిల్లులు కడుతున్నాం. ఉదయం 5 గంటలకు అధికారులు వచ్చి కూల్చివేస్తున్నామని చెప్పి.. వెంటనే కూల్చివేతలు ప్రారంభించారు. రెండు రోజులు సమయం ఇవ్వాలని అధికారులను కోరినా వినలేదు. ఇందులో ఉన్న సామన్లు సర్దుకుంటామని చెప్పినా వినకుండా కూల్చివేతలు ప్రారంభించారు. మాకు రూ. 20 లక్షల ఆస్తినష్టం వచ్చింది. మా ఇళ్లు ఉన్న సర్వే నంబర్లో పెద్ద పెద్ద బడాబాబుల అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాటిని కూల్చడం లేదు. పేద వాళ్ల ఇండ్లను మాత్రమే కూల్చుతున్నారు.
మాకు న్యాయం చేయాలి
– బాధితురాలు అరుణ
నా పిల్లల ఉసురు రేవంత్‌రెడ్డికి తగులుతుంది. ఉన్న రెండు ఎకరాలు ఊర్లోలో అమ్మి స్థలం కొనుకొని షెడ్డూ వేసుకుని జీవిస్తుంటే కూల్చివేస్తున్నారు. స్థలం కొనుక్కొని లోన్ తీసుకుని షెడ్డు నిర్మించుకుంటే హైడ్రా కూల్చివేతలతో రోడ్డు మీద పడ్డాం. ఎంతో కష్టపడి ఇంటిని నిర్మించుకుంటే మాపై దయ చూపకుండా కూల్చివేస్తున్నారు. మాకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఊర్లో అమ్ముకున్న భూమితో పాటు కొనుకున్న స్థలం పోతే మేము ఎలా బతకాలి.