నెక్నాంపూర్ గ్రామ పెద్ద చెరువు ఎగువ ప్రాంతంలోని కొనసాగుతున్న లేక్ వ్యూ వెంచర్లో నిర్మితమవుతున్న విల్లాలకు గతంలో మణికొండ మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ అధికారులు అనుమతులిచ్చినట్లు తెలిసింది. అయితే ఆ నాలుగు విల్లాలు బఫర్‌జోన్ పరిధిలోకి వస్తాయంటూ స్థానిక గండిపేట రెవెన్యూ అధికారులు సూచించడంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇచ్చిన అనుమతులను గుట్టుచప్పుడు కాకుండా రీవోక్ చేసినట్లు సమాచారం. మున్సిపల్ అధికారులు అనుమతులివ్వడంతోనే తాము విల్లాలు నిర్మించామని ఇప్పుడు..హైడ్రా అధికారులు వచ్చి ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.
HYDRAA | మణికొండ, జనవరి 10: నెక్నాంపూర్ పెద్ద చెరువు ఎగువ ప్రాంతంలో గత కొన్నాళ్లుగా నిర్మాణాలు చేపడుతున్న లేక్ వ్యూ వెంచర్లో నాలుగు విల్లాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో శుక్రవారం కూల్చివేశారు. చెరువు బఫర్జోన్ల పరిధిలో నిర్మితమవుతున్న ఈ విల్లాలకు అనేకసార్లు మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసినా.. మొండిగా నిర్మాణాలు చేపడుతుండటంతో స్థానిక ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ నెక్నాంపూర్లో పర్యటించిన మరుసటిరోజే కూల్చివేతలను చేపట్టారు. గతంలోనూ రెవెనూ, ఇరిగేషన్‌శాఖ అధికారులు లేక్ వ్యూ లే అవుట్లో వెలసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. అయినా సదరు నిర్మాణదారుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అధికారుల పర్యటన తర్వాత సదరు బిల్డర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.