HYDRAA | సిటీబ్యూరో/బంజారాహిల్స్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్కుల ఆక్రమణల విషయంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఫిల్మ్‌నగర్‌లో రోడ్డును ఆక్రమించారంటూ నిర్మాణాన్ని శనివారం హైడ్రా సిబ్బంది కూల్చేశారు. స్థానికుల ఫిర్యాదుతో మొదట ఫిల్మ్‌నగర్ లేఔట్‌ను పరిశీలించిన హైడ్రా అధికారులు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు.
ఫిలింనగర్ రోడ్ నం. 1లోని శంకర్ విలాస్ చౌరస్తాలో మహనీయుల విగ్రహాల వెనుక 290 గజాల స్థలంలో రేకుల షెడ్డుతో పాటు భవనం ఉంది. సొసైటీ లే అవుట్లో ఈ స్థలం జీహెచ్ఎంసీ రోడ్డు అని చూపిస్తోందని, సొసైటీ ప్రతినిధులు దీన్ని మహిళా మండలి పేరుతో ఆక్రమించుకున్నారని స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో పాటు స్థానిక జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 2న హైడా డిప్యూటీ సిటీ ప్లానర్ మహిళా మండలికి నోటీసులు జారీ చేశారు.
దీనికి వారిచ్చిన సమాధానంతో సంతృప్తికరంగా లేదంటూ.. తిరిగి 6న మరో నోటీసు ఇచ్చి అందులో 24 గంటల్లోగా ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ వారు ఖాళీ చేయకపోవడంతో శనివారం మధ్యాహ్నం జేసీబీలతో వచ్చిన హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది మహిళా మండలి భవనాన్ని కూల్చివేశారు. అదే స్థలానికి ఆనుకొని ఉన్న ఇల్లు ప్రహారీ కూడా ఆక్రమించి నిర్మించినట్లు నిర్ధారించి.. రేకుల షెడ్డుతో పాటు రోడ్డుపైకి వచ్చిన ఇంటి గోడను కూడా కూల్చేశామని హైడ్రా అధికారులు చెప్పారు. కూల్చివేతలు జరిగిన వెంటనే డెబ్రిస్‌ను అక్కడి నుంచి తొలగించారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడి తమ అధికారులు కూల్చేసిన స్థలంలో వెంటనే రోడ్డు నిర్మించాలని సూచించారు.
సుమారు 30ఏండ్ల కిందట ఫిలింనగర్ సొసైటీకి చెందిన ఖాళీ స్థలంలో నిర్మించిన మహిళా కల్చరల్ సెంటర్ భవనాన్ని కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారని ఫిలింనగర్ సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ ఆరోపించారు. ఈనెల 2న నోటీసులు ఇచ్చిన హైడ్రా అధికారులకు సొసైటీ తరపున జవాబు ఇచ్చామని చెప్పారు. 2023 నవంబర్లోనే సిటీ సివిల్ కోర్టులో తమకు పర్మినెంట్ ఇంజెంక్షన్ ఆదేశాలు ఉన్నాయని, ఈ స్థలంపై జీహెచ్ఎంసీకి హక్కు లేదని, సొసైటీకి చెందిన స్థలంలో సుమారు 30 ఏండ్ల కిందటే భవనం నిర్మించామని నేరుగా హైడ్రా కమిషనర్‌కు లేఖ రాశామని సూర్యనారాయణ చెప్పారు.