సిటీబ్యూరో, జనవరి 25(నమస్తే తెలంగాణ): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి వద్ద దివ్యనగర్ లేఅవుట్లో రహదారులను మూసేసి అక్రమంగా నిర్మించిన భారీ ప్రహారీని హైడ్రా ఆధ్వర్యంలో శనివారం కూల్చేశారు. ఎన్ఎంఆర్ సంస్థ యజమాని నల్లమల్లారెడ్డి దాదాపు 200 ఎకరాల్లో 2,218 ప్లాట్లుగా విస్తరించిన దివ్య లేఅవుట్ చుట్టూ 4కిలోమీటర్ల మేర ప్రహారీ నిర్మించారు. దివ్య లే అవుట్లో ఉన్న తమ ప్లాట్లను చూడడానికి వెళ్లే అవకాశం లేకుండా నల్లమల్లారెడ్డి చేస్తున్నారంటూ ఇటీవల ప్లాట్ల యజమానులు ఇచ్చి న ఫిర్యాదుల మేరకు హైడ్రా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి కూల్చివేతలు చేపట్టింది.
శనివారం వేకువ జామునుంచే మొదలైన కూల్చివేతల్లో 12హెవీ బుల్డోజర్లను వినియోగించి భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రహారీతో పాటు ఇతర నిర్మాణాలను కూల్చివేసి రహదారులను తెరిచారు. దీంతో 17 కాలనీలు, లేఅవుట్లకు దారులు తెరుచుకున్నాయని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఈ లేఅవుట్ ప్రహారీ వల్ల చుట్టు పక్కల ప్రజలతో పాటు అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన సింగరేణి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. కూల్చివేతలకంటే ముందు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈనెల 8న క్షేత్రస్థాయిలో దివ్యలేఅవుట్ ప్రాంతాన్ని పరిశీలించారు.
ఆ తర్వాత 23న హైడ్రా ప్రధాన కార్యాలయంలో ఇరు పక్షాలతో చర్చించిన కమిషనర్ స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఎన్ఎంఆర్ ఆక్రమణ గురించి ధ్రువీకరించడంతో ప్రహారీ నిర్మాణానికి అనుమతులు లేవని నిర్ధారించారు. దివ్యనగర్ లేఅవుట్లో ఉన్న ప్లాట్లలో 30శాతం ప్లాట్లు నల్లమల్లారెడ్డివేనని, మిగతావాటిలో వెయ్యిమంది వరకు సింగరేణి ఉద్యోగులు కొనుగోలు చేశారని హైడ్రా అధికారులు చెప్పారు. ఎన్ఎంఆర్ యజమాని నల్లమల్లారెడ్డి ఈ లేఅవుట్లలో 40 అడుగులు, 50 అడుగులు, 25 అడుగుల రహదారులు మూసేసి అడ్డంగా గేట్లు పెట్టారని, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి లేఅవుట్లలోకి తమను రానివ్వడం లేదని సింగరేణి కార్మికుల ఫిర్యాదు మేరకు ఈ కూల్చివేతలు చేపట్టారు.
పోచారం మున్సిపాలిటీ పరిధిలో ప్రహారీ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. నల్లమల్లారెడ్డి తన లేఅవుట్‌కు భద్రత పేరిట 200 ఎకరాల చుట్టూ నాలుగు కిలోమీటర్లమేర కాంపౌండ్‌వాల్ కట్టారని, అన్ని విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించారని రంగనాథ్ తెలిపారు. పదుల ఎకరాల్లో ప్రభుత్వ భూమిని లాక్కొని ఎన్ఎంఆర్ సంస్థ కాంపౌండ్ వాల్ కట్టిందని.. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని ఆయన పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పులు, మున్సిపల్ చట్టాల ప్రకారం రహదారులకు ఆటంకం కల్పించే విధంగా ఏవైనా కట్టడాలు చేపడితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేయవచ్చని, ఈ క్రమంలోనే దివ్యలేఅవుట్ చుట్టూ ఉన్న ప్రహారీని కూల్చేశామని రంగనాథ్ తెలిపారు. సర్వే నంబర్ 66లో 6.06 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా నల్లమల్లారెడ్డి కబ్జా చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదుపై హైడ్రా విచారణ చేపట్టిందని, ఈ భూమి స్వాధీనంతో పాటు కబ్జాకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని రంగనాథ్ పేర్కొన్నారు.