సిటీబ్యూరో/నేరేడ్మెట్:జవహర్‌నగర్‌లోని యాప్రాల్‌లో శుక్రవారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. బఫర్‌జోన్‌లో నిర్మించిన డోకూరి నర్సింహారెడ్డి ఫంక్షన్ హాల్లో కొంతభాగాన్ని, ప్రహరీని నేలమట్టం చేశారు. నాగిరెడ్డి కుంట నాలాను ఆనుకొని ఉన్న బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులొచ్చాయి. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీ విభాగాల అధికారులు విచారణ చేపట్టారు.
సర్వే నంబర్ 14,32 లోని ప్రభుత్వ భూమిలోకి జరిగి డీఎన్ఆర్ ఫంక్షన్‌హాల్ నిర్మాణం జరిగినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ భూమి సర్వే నంబర్లలో నిర్మాణం చేపట్టి ప్రైవేటు స్థలానికి చెందిన సర్వే నంబర్లో నిర్మించినట్లుగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన నిర్మాణదారుడు స్టేటస్కో ఆర్డర్ తెచ్చుకున్నారని హైడ్రా అధికారులు తెలిపారు. మరోవైపు ఫంక్షన్‌హాల్ మొత్తం స్టేటస్ కో ఉన్నదంటూ అధికారులను తప్పుదోవ పట్టించారని వారు పేర్కొన్నారు.
హైడ్రా విచారణలో ఈ భూమి ప్రభుత్వ భూమిగా తేలడంతో కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమి సర్వే నంబర్లు 14,32 పరిధిలోకి వచ్చిన ఫంక్షన్హాల్లోని కొంత భాగాన్ని, కాంపౌండ్ వాల్‌ను హైడ్రా బృందం కూల్చేసింది. నాగిరెడ్డి కుంట బఫర్‌జోన్‌లో నాలాకు ఆనుకొని ఉన్న భూమిలో ఫంక్షన్‌హాల్ నిర్మించినందుకు వాటిని కూల్చేశామని అధికారులు తెలిపారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న సర్వే నంబర్ 25లో కూల్చివేతలు చేపట్టలేదని వారు స్పష్టం చేశారు. సర్వే నంబర్ 32లో ధోబీఘాట్‌ను కబ్జా చేసేందుకు చేసిన ప్రయత్నాలను కూడా హైడ్రా అడ్డుకుంది.