హైడ్రా మరోసారి బడుగుల ఇండ్లపై పడగెత్తింది. ఇందిరమ్మ ఇండ్లలో నివాసం ఉంటున్న నిరుపేదలు తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న రేకుల రూములను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు. పేదలపై ప్రతాపం చూపుతున్న అధికారులు పెద్దల ఆక్రమణలను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని బాధితులు మండిపడ్డారు. రోడ్డుకు అడ్డంగా అధికారులు కూల్చివేసిన సామాన్లు వేసి బైఠాయించి నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా తమ ఇండ్లను కూల్చివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుండిగల్, మార్చి 4: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ -2 నుండి బాలాజీ హిల్స్ కాలనీ, కే టీ ఆర్ కాలనీకి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఇందిరమ్మ కాలనీవాసులు తమ ఇండ్ల ముందున్న స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన రేకుల రూములను హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేయడంపై ఉద్రిక్తకు దారితీసింది.
రాకపోకలకు ఇబ్బందింగా ఉన్నాయనే నెపంతో గత కొంతకాలంగా బాలాజీ హిల్స్, కేటీఆర్ కాలనీవాసులకు, ఇందిరమ్మ ఇండ్ల నివాసుల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైడ్రా అధికారులు, సిబ్బంది తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, భారీ పోలీసు బందోబస్తు, జేసీబీలతో ఇందిరమ్మ కాలనీ ఫేజ్ లో రోడ్డు కు ఇరువైపుల ఉన్న చిరు వ్యాపారాల కోసం ఏర్పాటు చేసిన రేకుల రూములను కూల్చివేశారు. కొందరు సామాన్లు తీసుకుంటామని వేడుకున్న అధికారులు కనికరించలేదని, దీంతో తాము లక్షలాది రూపాయలు నష్టపోయామని పలువురు ఇందిరమ్మ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
వృద్ధుల మైన తాము చిన్నపాటి కొట్టును అప్పుచేసి ఏర్పాటు చేసుకున్నామని, ఇంకా అప్పు తీరక ముందే అధికారులు తమ ఇంటి ముందున్న షెడ్డును కూల్చివేయడంతో వృద్ధ దంపతులు విలవిలలాడారు. 70 ఏళ్ల పై చీలుకు వయసులో తాము ఎలా బతకాలంటూ విలపించారు. మరోవైపు హైడ్రా అధికారుల కూల్చివేతలను నిరసిస్తూ కాలనీవాసులు బాలాజీ హిల్స్ కాలనీ కమాన్ వద్ద రోడ్డుకు అడ్డంగా అధికారులు కూల్చిన సామానువేసి బైఠాయించారు. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు ముందస్తు సమాచారం ఇచ్చిన సామాన్లు తీసి బయట పెట్టుకునే వారమని వాపోయారు.
ఇందిరమ్మ ఇండ్లనే కూలుస్తారా
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యమని, ఇందిరమ్మ రాజ్యంలోనే ఇందిరమ్మ ఇళ్లను కూలుస్తారా ! ఏమిటి అన్యాయం. వాళ్ళు ఇచ్చిన ఇండ్లలోనే ఉంటున్నాం.. ఇదెక్కడి న్యాయం. పదిహేను ఏళ్ల క్రితం ఇచ్చినప్పుడు పాములు, విష పురుగులు తిరిగేవి. అన్నీ తట్టుకొని ఉంటున్నాం. ఇప్పుడు రోడ్డుకు అడ్డుగా ఉన్నాయంటూ గుడారాలను కూల్చి పొట్ట మీద కొడుతున్నారు.
– దుర్గ , స్థానికురాలు
మా ఉసురు తగులుతది
పొట్టకూటి కోసం మా ఇంటి ముందర చిన్న షాప్ పెట్టుకున్నాం. చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకుంటూ జీవనోపాధిని పొందుతున్నాం. అపార్ట్మెంట్ల వాసులను కాదని, మా గూడును కూలిస్తున్న వారికి తప్పకుండా ఉసురు తగులుతుంది. మా ఇండ్లను కులగొట్టినంతమాత్రాన అపార్ట్మెంట్ల వాళ్లకు రోడ్డు ఇవ్వము ఏం చేసుకుంటారో చేసుకోండి.
– తిరుపతమ్మ
ఇప్పుడు ఎలా బతికేది
వయసు 70 ఏళ్ల పైబడి ఉంది. మా ఇంటి ముందు ఉన్న ఖాళీ జాగాలో అందరి మాదిరిగానే చిన్న రేకుల దుకాణం ఏర్పాటు చేసుకొని బతుకుతున్నాం. ఇందుకోసం అప్పు కూడా చేశాం. అప్పు తీరక ముందే అధికారులు రేకుల రూమును తొలగిస్తుంది. ఏ పని చేయలేని వయసులో జీవనోపాధిని ప్రభుత్వం కూల్చివేసింది. ఇప్పుడు మేము ఎలా బతకాలి. ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
– శాంత
ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు
కూల్చివేతలకు ముందు మున్సిపల్ అధికారులు, హైడ్రాధికారులు కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. నిజంగా రోడ్డు ఆక్రమణలను తొలగించాల్సి వస్తే కేటీఆర్ కాలనీ నుంచి బాలాజీ హిల్స్ కాలనీ మీదుగా అన్ని తొలగించాలి. కానీ అధికారులు కొందరినీ టార్గెట్ చేసి కొన్ని ఇలాంటి మాత్రమే కూల్చివేయడం ఎటువంటి న్యాయం అనుకోవాలి. – జ్యోతి