హైదరాబాద్: హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఐదు నిర్మాణాలకు కూల్చివేసిన హైడ్రా సిబ్బంది.. తాజాగా జూబ్లీహిల్స్‌లో బేసీబీలకు పనిచెప్పారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలో ఉన్న నాలాపై ఆక్రమణలను తొలగిస్తున్నారు.
నాలాను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు.. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. ఈ సందర్భం భారీగా పోలీసులు మోహరించారు.
కాగా, మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ పరిధిలో గురువారం హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీసింది. ఎలాంటి సమాచారం అందించకుండా బాధితులు ఎంతగా వేడుకున్నా.. సమయం ఇవ్వాలని కోరినా..కనికరించకుండా అనుమతులు ఉన్న ఐదు నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో పాటు తమ ఊర్లలో ఉన్న భూములను అమ్మితే వచ్చిన డబ్బులతో స్థలం కొనుగోలు చేసుకుని నిర్మాణాలు చేసుకుంటే హైడ్రా పేరిట తమ జీవితాలను రోడ్డున పడవేశారని బాధితులు ఆరోపించారు. కేసీఆర్ పాలననే బాగుండేనని చెప్పిన బాధితులు.. కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తిపోశారు. రేవంత్‌రెడ్డికి ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.