సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): నగరంలో పలు చోట్ల బుధవారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కాప్రా మున్సిపాలిటీల్లో రాకపోకలకు అడ్డుగా ఎన్ఆర్ఐ కాలనీ వారు నిర్మించిన ప్రహరీని తొలగించింది. శంషాబాద్ మండలం రాళ్లగూడ గ్రామం వద్ద ఔటర్‌రింగ్ రోడ్డును చేరేందుకు వీలు లేకుండా రహదారులకు అడ్డంగా నిర్మించిన ప్రహరీని హైడ్రా సిబ్బంది కూల్చేశారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని సైనిక్‌పురిలో ఆర్మీ ఆఫీసర్ల కాలనీకి అడ్డుగా నిర్మించిన 50 మీటర్ల ప్రహరీని హైడ్రా తొలగించింది. ఇదే సర్కిల్ పరిధిలో ఉన్న డిఫెన్స్ కాలనీలో సర్వే నంబర్ 218/1లో ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలం కబ్జా అయిందంటూ హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ రంగనాథ్ చెప్పారు.
దాదాపు 1200 గజాల స్థలాన్ని స్థానిక అసోసియేషన్ పెద్దలు ప్లాట్లుగా చేసి విక్రయించారంటూ.. వారు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. డిఫెన్స్ కాలనీ నివాసితుల ఫిర్యాదు మేరకు స్థానిక అధికారులతో కలిసి హైడ్రా విచారించగా, స్థలాన్ని ఐదు ప్లాట్లుగా చేసి కొన్నింటిని అమ్మారని, మరికొన్నింటిని వారి ఆధీనంలోనే ఉంచుకున్నట్లు నిర్ధారించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఈ కబ్జాలను తొలగించి ప్రజా అవసరాలకు ఉద్దేశించిన జీహెచ్ఎంసీ సీ ల్యాండ్‌గా పేర్కొంటూ ప్రొటెక్టెడ్ బై హైడ్రా అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.
ప్రజావాణిలో ఫిర్యాదుతో..
కూకట్పల్లి-నిజాంపేట రోడ్డులోని హోలిస్టిక్ ఆస్పత్రి వెనుక ప్రభుత్వ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీని హైడ్రా తొలగించింది. అదే స్థలంలో తనకు కేటాయించిన 300 గజాల స్థలం ఉందని, ఓ మాజీ సైనికుడు హైడ్రా ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో 1253 గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు తేలింది. దీంతో స్థలం చుట్టూ ఉన్న ప్రహరీని హైడ్రా తొలగించింది. చుట్టుపక్కల కాలనీలకు దారులను మూసేస్తూ కాలనీల చుట్టూ ప్రహరీలు నిర్మిస్తే కూల్చివేత తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.