Musi River | ‘మా జాగాలో కట్టిన ఇండ్లను…మాకు ఇవ్వకుండా స్థానికేతరులకు ఎట్లిస్తరు? ఇండ్ల కోసం ఎన్నో రోజులుగా ఆశలు పెట్టుకొని బతుకుతున్నాం. మమ్మల్ని కాదనీ వేరే వారికి ఇక్కడ ఇండ్లు ఇస్తే మేము ఏం గావాలే… కిరాయి ఇండ్లలో ఉంటూ.. అద్దెలు చెల్లించలేక ఇబ్బందులుపడుతున్నాం. మా కండ్ల ముందే బయటవాళ్లు ఇండ్లలోకి వస్తుంటే మా కడుపులు కాలుతున్నాయి. మా కేసీఆర్ సార్ను దూరం చేసుకున్నాం. సార్ లేకపోవడంతోనే….రేవంత్రెడ్డి వచ్చినాక తీవ్రంగా బాధపడుతున్నాం.” ఇదీ డబుల్ బెడ్రూం ఇండ్ల దరఖాస్తుదారుల ఆవేదన.
మూసీ విస్తరించి ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లో సంబంధిత కలెక్టర్లు మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుపైనే దృష్టి సారించారు. మహానగరంలో అక్కడక్కడ నిర్మించిన ‘డబుల్’ సముదాయల్లో ఇండ్లు సిద్ధంగా ఉన్నాయి. అర్హులైన నిరుపేదలకు ఆ ఇండ్లు కేటాయించాల్సి ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో 17వేల మంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలోనూ ఇల్లు కేటాయించాలంటూ వచ్చే దరఖాస్తులే అధికం. తాము నివాసముంటున్న సంబంధిత ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూంల్లో తమకు ఇండ్లు కేటాయించాలంటూ బస్తీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏండ్లుగా ఎదురుచూస్తున్న వారిని కాదని మూసీ నిర్వాసితులను బలవంతంగా తీసుకొచ్చి ఇండ్లను కేటాయించడంపై అగ్గి రాజుకుంటున్నది.
పైసాపైసా కూడబెట్టి.. ఉన్నదాంట్లో కలల ఇంటిని నిర్మించుకున్నాం.. అలాంటి మా ఇండ్లను పడగొట్టడం అంటే మాకు మరణంతో సమానం. మాకు డబుల్ బెడ్రూంలు వద్దు..ఉన్న ఇండ్లలో ఉండనిస్తే చాలు.. ఇదీ మూసీ నిర్వాసితుల వేదన. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాలు పేదలకు చిక్కులు తెచ్చిపెడుతున్నది. ఒకవైపు ఇల్లు లేదు..మాకు డబుల్ బెడ్రూం గృహాలను కేటాయించాలంటూ..అనేక మంది కలెక్టరేట్ చుట్టూ తిరుగుతుంటే..మరోవైపు మూసీ ప్రక్షాళన పేరిట నిర్వాసితులను..డబుల్ బెడ్రూం ఇండ్లకు తరలిస్తున్నారు. మా ఇండ్లు మాకుంటే చాలు..రెండు పడకల గృహాలు వద్దంటున్నా.. వారిని బలవంతంగా చేతిలో పట్టాలు పెట్టి.. ఖాళీ చేయిస్తున్నారు. తమకు ఇండ్లు ఇవ్వకుండా ఇతరులకు డబుల్ గృహాలు కేటాయిస్తే ఆత్మహత్య చేసుకుంటామని దరఖాస్తుదారులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులను తమ కాలనీల్లోకి రానివ్వమంటున్నారు.
వీళ్లని కాదనీ..వాళ్లకు..!
పిల్లిగుడిసెలు, జియాగూడ, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో గుడిసెల్లో నివాసముంటూ ఇబ్బందులు పడుతున్న బస్తీవాసులకు మేలు చేయడంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. బస్తీవాసులు నివాసముంటున్న వారి వివరాలు తీసుకొని ఆ గుడిసెలను ఖాళీ చేయించి.. అక్కడే వాళ్లకు ఇండ్లు నిర్మించింది. అయితే అది దశలవారీగా పూర్తి చేసి విడతల వారీగా ఇండ్లు కేటాయింపు ప్రక్రియ జరిగింది. ఇదిలా ఉండగా ఇప్పుడు వచ్చిన రేవంత్ సర్కార్ అర్హులకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నది. నిబంధనల ప్రకారం ఆ ప్రాంతంలోని బస్తీ వాసులకే ఆ ఇండ్లు కేటాయించాల్సి ఉంటుంది. కాగా, మూసీ నిర్మాణాలు తొలిగించాలనే ఆలోచనతో అక్కడి వారిని బలవంతంగా వేర్వేరు చోట్ల ఉన్న రెండు పడకల ఇండ్లలోకి తరలిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం స్థానిక బస్తీవాసుల్లో గుబులు పుట్టిస్తున్నది. తమకు కేటాయించాల్సిన ఇండ్లను ఇతరులకు ఎలా కేటాయిస్తారంటూ ఆందోళన బాట పట్టారు. రేవంత్ పాలన అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు.