జవహర్నగర్, నవంబర్ 26: ఆది నుంచీ నిరుపేదలే లక్ష్యంగా.. వారి గృహాలు, చిన్నచిన్న దుకాణాలను అక్రమ కట్టడాల పేరుతో కూల్చేస్తున్న రేవంత్ సర్కార్ మరోసారి పేదలపై తమ ప్రతాపం చూపించింది. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో ఏళ్లుగా రేకుల ఇండ్లలో జీవనం సాగిస్తున్న నిరుపేదలకు కనీసం నోటీసులు ఇవ్వకుండా వాటిపై బుల్డోజర్లు నడిపారు.
కాప్రా తహసీల్దార్ రాజేశ్ ఆధ్వర్యంలో పోలీస్ పహారా మధ్య బుధవారం సర్వే నం 376, 377, 293, 202, 203/1, 710, 421, 812లో నిరుపేదల ఇళ్లను బుల్డ్డోజర్తో నేలమట్టం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు ఎలా కూలుస్తారు అని అడిగినవారిపై పోలీసులు బల ప్రదర్శన చూపించారు. కనీసం ఇళ్లలోని సామాను తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా జులుం ప్రదర్శించడంతో బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు.