హైడ్రా రంగంలోకి దిగింది. నగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నది. పలు చోట్ల ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కు స్థలాలను ఆక్రమించినట్లు గుర్తించి.. అక్రమనిర్మాణాలను కూల్చివేస్తున్నది. ఇందులో భాగంగా నందగిరి హిల్స్ హుడా లే అవుట్లో పార్కుకు కేటాయించిన ఖాళీ స్థలాన్ని పరిరక్షించేందుకు అక్రమ నిర్మాణాలను తొలగించి, ప్రహరీ నిర్మించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ విషయంలో బస్తీవాసుల తరపున స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో వివాదం తలెత్తింది. ఎమ్మెల్యే వర్సెస్ హైడ్రా కమిషనర్‌గా మారింది. చివరికీ ఈ పంచాయితీ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది.
సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లో ఆక్రమణలపై ‘హైడ్రా’ యాక్షన్‌లోకి దిగింది. రంగంలోకి దిగిన కమిషనర్ రంగనాథ్ బంజారాహిల్స్‌లోని మిథిలానగర్ కాలనీ, లోటస్‌పాండ్ పార్కు, గాజులరామారం, బుమ్రుఖా ఉద్ దవాల్ చెరువుల్లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు.
ఈ సమయంలో ఐదు రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నం. 52లోని నందగిరిహిల్స్ హుడా లే అవుట్‌లోని ఖాళీ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలు, డబ్బాలను రంగనాథ్ దగ్గరుండి కూల్చివేయించారు. వెంటనే కాలనీవాసుల సహకారంతో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. ఇక్కడే స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ రంగనాథ్ వ్యవహారాన్ని తప్పు పట్టారు. కూల్చివేతలు ఓకే..ప్రహరీ గోడ నిర్మాణంపై దానం అభ్యంతరం వ్యక్తం చేశారు.
రంగనాథ్ తీరుపై ఎమ్మెల్యే దానం భగ్గుమన్నారు. ఈ నెల 10న సంబంధిత ప్రాంతానికి చేరుకోగా తన అనుచరులు, బస్తీ వాసులు ప్రహరీని కూల్చివేశారు. ఇందుకు ప్రోత్సహించిన ఎమ్మెల్యే దానం పై చర్యలు తీసుకోవాలని హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ ఇన్చార్జి వి. పాపయ్య ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్‌లు కేసు నమోదు చేశారు. దీంతో రంగనాథ్‌పై దానం మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టి ఘాటుగా స్పందించారు.
దీంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరి చివరకు ఈ పంచాయితీ సీఎం వద్దకు చేరింది. అయితే సీఎం ఎలా స్పందిస్తారు? హైడ్రా అటు జీహెచ్ఎంసీ, ఇటు ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారిందన్న నేపథ్యంలో హైడ్రా తదుపరి ఆపరేషన్ ఎలా ఉంటుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.
జూబ్లీహిల్స్ రోడ్ నం.52లోని నందగిరిహిల్స్ హుడా లే అవుట్‌కు ఆనుకొని గురుబ్రహ్మనగర్ బస్తీ ఉంది. దాదాపు 400 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద కుటుంబాలు 40 ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఈ బస్తీ వాసులకు, నందగిరిహిల్స్ లే అవుట్ కాలనీవాసులకు మధ్య రహదారి విషయంలో వివాదం నడుస్తోంది. హైడ్రా కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ రంగనాథ్ ఆక్రమణలపై చర్యలకు ఉపక్రమించారు. ఇందు లో భాగంగానే నందగిరి హిల్స్ కాలనీకి, గురుబ్రహ్మనగర్ బస్తీకి మధ్య వివాదంలో ఉన్న సుమారు 850 గజాల ఓపెన్ ల్యాండ్‌ను పరిశీలించారు. వాస్తవానికి ఈ స్థలంలో పార్కు రావాల్సి ఉంది.
కానీ, ఈ స్థలం పరిధిలో కొంత మేర గురుబ్రహ్మనగర్ బస్తీ వాసులలో కొందరు టిఫిన్, చాయ్ దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. దీనిపై కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ నెల 9వ తేదీన పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దుకాణాలను కూల్చివేశారు. తక్షణమే కాలనీవాసుల సహకారం తీసుకొని ప్రహరీ గోడ నిర్మించాలని ఆదేశించారు. ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ నేను లోకల్లో లేను ..పార్కు స్థలం కాపాడేందుకు ఒకవేళ గోడ నిర్మాణం చేయాలంటే జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మిస్తామని, జీహెచ్ఎంసీ నిధులు మంజూరు చేస్తానని రంగనాథ్‌కు వివరించారు.
అయితే రంగనాథ్ మాత్రం తక్షణమే ప్రహరీ కట్టించి ప్రభుత్వ ఆస్తిని కాపాడే ప్రయత్నం చేశారు. రాత్రి పోలీసుల పహారాలో పేదల గుడిసెలకు ఆనుకుని భారీ ప్రహరీ ఏర్పాటు చేశారు. ఈ ప్రహరీ నిర్మాణంతో సుమారు 50 కుటుంబాలకు చెందిన గిరిజనులు ఇంట్లోంచి బయటకు రాకుండా గోడలు వెలియడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడం, బస్తీ వాసులు సంబంధిత ప్రహరీని కూల్చివేసే ప్రయత్నం చేశారు.
10న ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధిత ప్రాంతానికి చేరుకోవడం.. అనుచరులు, బస్తీ వాసులు ఆ ప్రహరీని కూల్చారు. ఈ స్థలానికి ఆనుకునే బసవరాజు అనే వ్యక్తి సుమారు 300 గజాల మేర కబ్జా చేసినా వారి జోలికి వెళ్లకుండా బస్తీ వాసులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారంటూ ఆరోపించారు. ఇందుకు ప్రోత్సహించిన దానంపై చర్యలు తీసుకోవాలని హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ ఇన్చార్జి వి.పాపయ్య ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దానం, మరికొందరిపై పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దీంతో దానం రంగనాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నందగిరిహిల్స్ హుడా లే అవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని దానం నాగేందర్ హెచ్చరించారు. గురుబ్రహ్మనగర్‌లో పేదల గుడిసెలు కూల్చివేసే అధికారం రంగనాథ్‌కు ఎవరిచ్చారని, సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ను జీపీఏ రాసిచ్చారా? అని దానం నాగేందర్ ప్రశ్నించారు. పేదల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానని.. వంద కేసులు పెట్టినా భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ స్పష్టం చేశారు.
అధికారులు వస్తుంటారు..పోతుంటారు.. తాను లోకల్ అని దానం చెప్పారు. ఉద్యోగం ఇష్టం లేని వాళ్లు, డైలీ పబ్లిసిటీ కావాలనుకునే వాళ్లే ఇలాంటివి చేస్తుంటారన్నారు. ఈనెల 10న నందగిరిహిల్స్ గురు బ్రహ్మనగర్‌లో ఉన్న పార్కుకు నిర్మాణం చేసిన ప్రహరీని కూల్చివేసిన ఘటనలో దానం ప్రమేయం ఉందనే అభియోగంతో జీహెచ్ఎంసీ విజిలెన్స్, డిజాస్టర్ విభాగం అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ నెల 12న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో మంగళవారం హైదర్‌గూడ, ఆవంతినగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ… హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు పదవి నచ్చకనే తనపై కేసు నమోదు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో అధికారులకు ప్రివిలేజ్ మోషన్ ఇస్తానన్నారు. నందగిరి హిల్స్ హుడా లే అవుట్ సమీపంలో ఉండే గిరిజనులకు ఇబ్బందులు కలుగుతుందనే విషయం తన దృష్టికి రావడంతో.. తాను అక్కడికి వెళ్లి సమస్యను రంగనాథ్‌కు ఫోన్లో తెలియజేశానని తెలిపారు.
పార్కు వద్ద కొందరు ప్రైవేట్ వ్యక్తులు గోడ నిర్మించారని స్థానికులు ఆవేశంతో తన ప్రమేయం లేకుండా గోడను కూల్చివేసిన మాట వాస్తమేనని, దీనికి అధికారులు హద్దు మీరి పనిచేయడం సబబు కాదన్నారు. బస్తీవాసులు రాకపోకలు సాగించేందుకు దారి లేకుండా ప్రహరీ గోడ ఎలా కడతారని, ప్రజాసమస్యలను పరిష్కరించడం తన బాధ్యతని వ్యాఖ్యానించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తానని దానం నాగేందర్ తెలిపారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో ఎవరికైనా ఒకే రూల్ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. నందగిరిహిల్స్ పార్కు స్థలం విషయంలో వ్యక్తిగతంగా ఎలాంటి ఆసక్తి లేదని, పార్కు స్థలం ఆక్రమణ కాకుండా చూసేందుకే అక్కడికి వెళ్లానని కమిషనర్ స్పష్టం చేశారు. గురుబ్రహ్మనగర్ బస్తీవాసులకు, నందగిరిహిల్స్ కాలనీవాసులకు మధ్య నడుస్తున్న వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
పార్కు స్థలం చుట్టూ ప్రహరీ నిర్మిస్తే బస్తీవాసులకు రోడ్డు లేకపోతే తనకు ఏం సంబంధం అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు తనపై ఒత్తిడి తెచ్చిన తాను పట్టించుకోనని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నందగిరి హిల్స్ పార్కు స్థలాన్ని ఆక్రమణలకు గురి కానిచ్చేది లేదని, బస్తీ వాసులకు రోడ్డు ఇచ్చే బాధ్యత తన బాధ్యత కాదన్నారు. నందగిరి హిల్స్ లే అవుట్లో 850 గజాల జీహెచ్ఎంసీ ఓపెన్ స్పేస్ ఉందని, ఇది ప్రభుత్వానికి చెందినదని, దీనిని కాపాడే యత్నంలో భాగంగా చుట్టూ ప్రహరీ నిర్మించడం జరిగిందన్నారు.