సిటీబ్యూరో, జనవరి 26(నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులలో కబ్జాలను తేల్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. జూలై 2024లో హైడ్రా ఏర్పాటు తర్వాత చెరువుల్లో ఆక్రమణలను మొదట గుర్తించి ఆ తర్వాత పాత వాటిపై దృష్టి పెడదామంటూ హైడ్రా అధికారులకు రంగనాథ్ సూచించారు. ‘ప్రజావాణి’లో హైడ్రాకు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎక్కడైతే చెరువుల ఆక్రమణలు కొనసాగుతున్నాయో వాటిని మొదట క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు తగిన ఆధారాలు సేకరించే పనిలో హైడ్రా బృందం తలమునకలై ఉన్నది.
ఇదే క్రమంలో ప్రభుత్వ స్థలాలు, పార్కులపై వస్తున్న ఫిర్యాదులను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు హైడ్రాకు వచ్చిన మొదటి నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో సుమారుగా వెయ్యి వరకు ఓఆర్ఆర్లోని చెరువుల ఆక్రమణలకు సంబంధించినవే ఉన్నాయి. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఆయా చెరువుల్లో ఆక్రమణలు ఎలా జరిగాయన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇందుకు సంబంధించి స్థానికులు, ఫిర్యాదుదారులను కలిసి వివరాలు సేకరిస్తున్నారు.
ముఖ్యంగా పదిహేను మంది హైడ్రాకు సంబంధించిన అధికారులు ఈ పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. తాము సేకరించిన సమాచారాన్ని హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వాటిపై చర్యలకు సంబంధించి నిర్ణయం జరుగుతుంది. అయితే తమ వద్దకు వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఇరుపక్షాలను హైడ్రా ఆఫీసుకు పిలిచి మాట్లాడి ఆ తర్వాత సంబంధిత శాఖల అధికారుల నుంచి సమాచారం తీసుకుని ఆ తర్వాత కూల్చివేతలకు వెళ్తామని హైడ్రా బృందం చెబుతున్నది. వందకు పైగా ఫిర్యాదులపై గ్రౌండ్‌వర్క్ పూర్తయిందని, త్వరలోనే వీటికి సంబంధించి చర్యలు ఉంటాయని వారు పేర్కొన్నారు.
హైడ్రా ఏర్పాటుకు ముందు జరిగిన ఆక్రమణలలో పర్మిషన్ ఉన్నా లేకున్నా ఎట్టి పరిస్థితుల్లో నివాసాలను కూల్చేయమని, కమర్షియల్‌గా వినియోగించే వాటిని మాత్రమే కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ చెప్పారు. ఇదే క్రమంలో ఆగస్టు నుంచి జరిగిన ఆక్రమణలను గూగుల్ మ్యాప్స్, ఎన్ఆర్ఎస్సీ, సర్వేఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా ఆగస్టుకు ముందు ఉన్న చిత్రాలను ఆ తర్వాత చిత్రాలను పోల్చి చూసి ఎక్కడైతే ఆక్రమణలు జరిగాయో వాటిపై చర్యలకు దిగుతామని హైడ్రా బృందం చెబుతున్నది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు గుర్తించిన బీరంగూడ, అమీన్పూర్, గాజుల రామారం తదితర చెరువుల ఆక్రమణలను తొలగించడానికి హైడ్రా సిద్ధమైంది.
అయితే తాము చెరువుల ఆక్రమణలపై హైడ్రా చర్యలకు పూనుకునే క్రమంలో అక్కడి నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానంగా కేవలం ప్రాథమిక నోటిఫికేషన్ ఆధారంగానే చర్యలకు దిగాలని రంగనాథ్ చెప్పినట్లు సమాచారం. ఇప్పటివరకు ఓఆర్ఆర్ పరిధిలో తుదినోటిఫికేషన్ వచ్చిన చెరువుల సంఖ్య వందలోపే ఉండగా.. మిగతా వాటికి ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రైమరీ నోటిఫికేషన్ తర్వాత ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు.. ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది నోటిఫికేషన్‌ను ఆలస్యం చేస్తున్నారంటూ హైడ్రా కమిషనర్ అంతర్గతంగా తమ అధికారులతో చర్చించారు. దీనిపై ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వగానే బఫర్ జోన్లోపల ఉన్న ఆక్రమణలను గుర్తించి చర్యలకు దిగాలని చెప్పారు. దీంతో త్వరలోనే హైడ్రా చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై బుల్డోజర్లు పంపడానికి సిద్ధమైంది.