సిటీబ్యూరో/శంషాబాద్‌రూరల్, జనవరి 9(నమస్తే తెలంగాణ): శంషాబాద్‌లో చెరువులపై హైడ్రా ఫోకస్ పెట్టింది. గురువారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చారినగర్లో ఉన్న గొల్లవానికుంట, ధర్మోజి కుంటలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించారు. సర్వే నంబర్ 73లో 10.12ఎకరాల గుంటల విస్తీర్ణంలో ధర్మోజి కుంట, సర్వే నంబర్104లో 22ఎకరాల 23 గుంటల విస్తీర్ణంలో గొల్లవాని కుంట ఉండాలి.. కానీ ఈ చెరువుల్లో 75శాతం లేకుండా పోయిందని, దీనికి ఎవరూ కారణమంటూ ఇరిగేషన్ అధికారులను రంగనాథ్ ప్రశ్నించారు.
ఈ కుంటలలో కొందరు మట్టిని నింపి ఆక్రమణలు చేశారంటూ హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా బృందం ధర్మోజి కుంట ప్రాంతంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో భారీ నిర్మాణాలు జరిగాయని, ప్రహరీ కుంట పరిధిలోకి రాదని ఇరిగేషన్ అధికారులు మొదలు చెప్పి తర్వాత రికార్డులు పరిశీలించడంతో బఫర్‌లోకి వస్తుందంటూ చెప్పడంతో రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మోజికుంటను పూడ్చివేస్తూ నిర్మాణం చేస్తున్నది ఎవరంటూ కమిషనర్ అధికారులను అడగగా కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువులంటూ వారు బదులిచ్చారు.
బఫర్ జోన్లో ప్రహరీ నిర్మించిన వ్యక్తికి నోటీసులివ్వాలని, రెండురోజుల్లో సొంతంగా కూల్చివేయకపోతే ఆ తర్వాత హైడ్రా కూల్చివేతలు తప్పవని, దీంతోపాటు చెరువులో వేసిన మట్టిని కూడాఎత్తివేయించాలని సూచించారు. మరోవైపు కబ్జాదారుతో కుమ్ముక్కై కాదు.. కూడదు అంటూ కాలం గడుపుతూ సమస్యను పక్కదోవ పట్టిస్తే ఇరిగేషన్ అధికారులపై కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. ధర్మోజికుంట, గొల్లవాని కుంట చెరువును కనుమరుగు చేస్తూ ప్లాట్లు చేసి అమ్ముకున్నది ఎవరంటూ స్థానిక అధికారులను రంగనాథ్ ప్రశ్నించారు. మున్సిపల్‌చైర్‌పర్సన్ భర్త మహేందర్‌రెడ్డిని చూపిస్తూ ఇతనే అమ్ముకున్నారని అధికారులు చెప్పగా కమిషనర్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల కబ్జాకు కారణమైన వారితో పాటు వారికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తప్పవంటూ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను హెచ్చరించారు.
నెక్నాంపూర్ చెరువుల పరిశీలన
మణికొండ: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ గ్రామ చిన్న, పెద్ద చెరువులను గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన కలిసి పరిశీలించారు. స్థానికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో గురువారం ఆయన చెరువు సరిహద్దులను పరిశీలించారు. పెద్దచెరువు ఎగువ కొన్ని నిర్మాణాలను పరిశీలించిన ఆయన ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకొని ఇరిగేషన్ శాఖ ద్వారా అనుమతులు పొందిన వాటిపై చర్యలు తీసుకోబోయని తెలిపారు. చిన్నచెరువు కింద బఫర్‌జోన్ పరిధిలో బహుళ అంతస్తులు నిర్మాణానికి జరుగుతున్న పనుల వివరాలు తెలుసుకున్నారు. గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ విక్రమ్‌రెడ్డి, మణికొండ మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారి సంతోష్‌సింగ్, స్థానికులు పాల్గొన్నారు.