గ్రేటర్లో ఆక్రమణలపై బుల్డోజర్లు నడిపిన హైడ్రా.. ఇప్పుడు కొన్ని శాఖల అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది. ముఖ్యంగా రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారుల్లో కొందరు హైడ్రా ఎప్పుడేం చేస్తుందోనని హడలెత్తిపోతున్నారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన వ్యవహారంలో ఆక్రమణలకు సహకరించారంటూ ఆరుగురు ముఖ్య అధికారులపై హైడ్రా కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జరిగిన కూల్చివేతలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఆక్రమణలకు ఎవరెవరూ సహకరించారన్న దిశగా హైడ్రా ఆరా తీసింది. ఇప్పటివరకు సుమారు 50 మందికి పైగా అధికారులు.. మరో 30 మంది సిబ్బంది ఈ అడ్డగోలు అనుమతుల్లో కీలకపాత్ర పోషించినట్లు తేల్చింది. అయితే ఆధారాలతో 23 మందిపై కేసులు పెట్టేందుకు కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు తెలిసింది. సాధారణ ఉద్యోగులు కాకుండా డీసీ, ఏసీ, సీపీలు కాకుండా హెచ్ఎండీఏకు సంబంధించిన ముఖ్య అధికారులు కూడా జాబితాలో ఉండటం గమనార్హం.
హైడ్రా నేతృత్వంలో ఇప్పటివరకు కూలగొట్టిన అక్రమ కట్టడాల విస్తీర్ణం 111 ఎకరాలుగా ఉంది. రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల్లో పనిచేస్తున్న అధికారుల్లో ఎవరెవరూ ఎన్ని కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చారు. వీటిలో ఎవరి పాత్ర ఏంటనే కోణంలో హైడ్రా ఆరా తీసింది. ఇందులో అధికారులతో పాటు సిబ్బంది కీలక పాత్ర పోషించినట్లు తేల్చింది. ఇప్పటివరకు ఆరుగురిపై ఫిర్యాదు చేసిన హైడ్రా కమిషనర్.. ప్రస్తుతం మరో 23 మందిపై ఫిర్యాదు చేయడానికి లిస్ట్ రెడీ చేసినట్లు తెలుస్తున్నది. వీరిలో ఎక్కువగా రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సిబ్బంది ఉండగా, ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఆక్రమణలకు సంబంధించి కొందరు రిటైర్డ్ అధికారులు ముఖ్యపాత్ర పోషించినట్లు హైడ్రా తేల్చింది. ఉద్యోగులు రిటైరయినా..వారి అక్రమాలపై కచ్చితంగా రిపోర్ట్ తయారు చేసి ఆక్రమణల విషయంలో వారి పాత్రకు సంబంధించి పూర్తి వివరాలతో కేసులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చెరువుల ఆక్రమణల్లో ఉన్న కంపెనీల్లో ఎక్కువగా రెరా, హెచ్ఎండీఏ అనుమతి వెంచర్లు ఉండటంతో అక్కడ జరిగిన అక్రమాలపై ఆరా తీసిన హైడ్రా కమిషనర్.. హెచ్ఎండీఏ అధికారుల్లో ఎవరెవరిపై చర్యలు తీసుకోవాలి.. ఎవరిపై ఎటువంటి కేసులు పెట్టాలనే విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు.
శాటిలైట్ చిత్రాల ప్రకారం ఓఆర్ఆర్ లోపల ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, పార్క్‌ల జాబితా తయారు చేసిన హైడ్రా.. ఆతర్వాత ఇందుకు కారకులెవరనే విషయంపై ఆరాతీసింది. ఈ ఆక్రమణలకు అడ్డగోలుగా అనుమతిలిచ్చినట్లు గుర్తించారు. ప్రాథమిక ఆధారాల మేరకు మొత్తం ఆరుగురు అధికారులపై హైడ్రా గతంలోనే ఫిర్యాదు చేసింది. ఇందులో చందానగర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఎం.రాజ్‌కుమార్, చందానగర్ సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్ ఎన్ సుధామ, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు, బాచుపల్లి ఎమ్మార్వో పూల్‌సింగ్, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్‌కుమార్, మేడ్చల్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కె. శ్రీనివాసులుపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరిపై దర్యాప్తు జరుగుతున్నది. వీరే కాకుండా మరికొంతమంది పాత్రపై కూడా హైడ్రా ఆరా తీసింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో అడ్డగోలుగా అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై దృష్టి పెట్టింది. హెచ్ఎండీఏ పరిధిలో లేఔట్ల విషయంలోనూ తప్పుడు మ్యాపుల ఆధారంగా అనుమతులిచ్చారన్న ఆరోపణలున్నాయి. అంతేకాకుండా రెవెన్యూ, ఇరిగేషన్ ఇచ్చిన ఎన్ఓసీ ఆధారంగా చేసుకునే అనుమతులిచ్చిన పరిస్థితులూ ఉన్నాయి.