సిటీబూరో/మైలార్‌దేవ్‌పల్లి : చందానగర్, నిజాంపేట చెరువులకు సంబంధించిన బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా సైబరాబాద్ పోలీసులకు హైడ్రా సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి ఆదేశాల మేరకు నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ బల్దియా డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, బాచుపల్లి ఎంఆర్వో పూల్‌సింగ్, మేడ్చల్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి సుధీర్‌కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్‌కుమార్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఈవోడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ తెలిపారు.
గగన్‌పహాడ్‌లోని అప్పా చెరువులో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య చెరువును ఆక్రమించి నిర్మించిన 13 నిర్మాణాలను నేలమట్టం చేశారు. కబ్జాదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించిగా, పోలీసులు వారిని నిలువరించి.. కూల్చివేతలను కొనసాగించారు. కాగా, సున్నం చెరువు, ఈదుల కుంటను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఆక్రమణలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పద్మావతినగర్ బస్తీవాసులకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో కమిషనర్ రంగనాథ్ చెరువు పరిశీలనకు రావడంతో బస్తీవాసులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు.
మైలార్‌దేవ్‌పల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి అప్పాచెరువును ఆక్రమించి భారీ షెడ్డు నిర్మించారు. ఎఫ్టీఎల్లో నిర్మాణాన్ని చేపట్టినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. అయితే పట్టా భూముల్లో నిర్మించుకున్న నిర్మాణాలను రాజకీయ కక్షతో కూల్చి వేశారని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు.సీఎం రేవంత్‌రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా వ్యవహరించి నిర్మాణాలను కూల్చివేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ తాతల కాలం నుంచి వస్తున్న భూముల్లో చేపట్టిన నిర్మాణాలను అక్రమ కట్టడాలని ఎలా నిర్ణయిస్తారని ఆయన మండిపడ్డారు.