HYDRAA | సిటీబ్యూరో/మణికొండ, దుండిగల్, మెహిదీపట్నం, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): చెరువులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి కబ్జాకాకుండా చూడాలని, ఆక్రమణలపై పూర్తిస్థాయిలో సమీక్షించి సర్వే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల కబ్జాలపై వస్తున్న హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదుల నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ తన బృందంతో పాటు స్థానిక అధికారులతో కలిసి బుధవారం గ్రేటర్ పరిధిలోని ఏడు చెరువులను సందర్శించారు. నిజాంపేటలోని నిజాంతలాబ్ చెరువు (తురక చెరువు), మాదాపూర్‌లోని మేడికుంట చెరువు, ఈదులకుంట, నార్సింగ్‌లోని నెక్నాంపూర్ చెరువు, తెల్లాపూర్‌లోని వనం చెరువు, చెల్లికుంట, మేళ్ల చెరువులను సందర్శించారు.
మేడ్చల్ జిల్లా నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని తుర్కచెరువులో ఆక్రమణలతో పాటు కలుషితనీరు కలుస్తుందన్న ఫిర్యాదుతో ఆ చెరువును రంగనాథ్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. చుట్టుపక్కల గేటెడ్ కమ్యూనిటీల నుంచి మురుగునీరు చేరి పలు చెరువులు కలుషితం అవుతున్నాయని స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో ఉన్న ఈదుల కుంట చెరువును రంగనాథ్ రెవెన్యూ, హైడ్రా అధికారులతో కలిసి పరిశీలించారు. తెల్లాపూర్‌లోని వనం చెరువు, చెల్లికుంట, మేళ్లచెరువులను సందర్శించిన రంగనాథ్‌కు స్థానికులు అక్కడ ఉన్న పరిస్థితులను స్పష్టంగా వివరించారు.
గతంలో పనిచేసిన ఇరిగేషన్ అధికారులు ఆక్రమణలకు ఎన్వోసీ ఇచ్చారని, వాటిపై కూడా రంగనాథ్ దృష్టిపెట్టాలని కోరారు. చెల్లికుంట వద్ద కల్వర్టు కట్టారని, అసలు పర్మిషన్ ఇవ్వకూడని చోట ఇచ్చారంటూ చెల్లికుంట అలుగు దాటితే వరద వస్తుందని చెప్పారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్గ్రామ చిన్న,పెద్ద చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానిక అధికారులతో కలిసి సందర్శించారు. గత కొన్నిరోజులుగా స్థానిక సిటిజన్ కౌన్సిల్, ధృవాన్ష్ సంస్థ ప్రతినిధులు చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రంగనాథ్ చెరువుల స్థితిగతులపై స్థానిక ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పెద్ద చెరువు ఎగువ ప్రాంతంలో చెరువు భూములను ఆక్రమించి యధేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకువచ్చారు. లేక్‌వ్యూ విల్లాల పేరిట జరుగుతున్న నిర్మాణాల్లో 11 విల్లాల వరకు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నారని..అందులో ఐదు నిర్మాణాలను కూల్చివేసినా తిరిగి నిర్మాణాలు జరుగుతున్నాయని ఇరిగేషన్ అధికారులు రంగనాథ్‌కు తెలిపారు. అనంతరం చిన్నచెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిధులను ఆయన పరిశీలించారు.వారం రోజులుగా చిన్నచెరువు బఫర్‌జోన్ పరిధుల పరిరక్షణలో భాగంగా ఇరిగేషన్ అధికారులు చేపట్టిన ఫెన్సింగ్ పనులను పర్యవేక్షించారు.
ఇక్కడ ఎగువ ప్రాంతంలోనూ చెరువు భూములు ఆక్రమణలకు గురయ్యాయంటూ ఫిర్యాదుదారులు తెలిపారు. ఇందుకు స్పందించిన ఇరిగేషన్ శాఖ జేఈ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఎగువ ప్రాంతంలో ఎక్కడా చెరువు సరిహద్దులు ఆక్రమణలకు గురికాలేదని.. ఫెన్సింగ్ వేసే సమయంలో తవ్వి మట్టి కుప్పలు వేసినట్లు చెప్పారు. పూజా కన్స్ట్రక్షన్ అపార్ట్ట్మెంటులో సగానికి పైగా చెరువు ఎఫ్టీఎల్లోకి వస్తుందని వారు కమిషనర్‌కు తెలిపారు. రెండు చెరువుల సరిహద్దులపై స్పష్టమైన నివేదికలను సిద్ధం చేసి అందజేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కమిషనర్ రంగనాథ్ కోరారు.
నివేదికలను పరిశీలించిన తర్వాత మరోసారి చెరువులను సందర్శిస్తానన్నారు. చెరువుల పరిరక్షణ కోసం ఎక్కడికక్కడా చెరువుల చుట్టూ ఫెన్సింగులు వేసి కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతులు పొంది జరుగుతున్న నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోబోమని వెల్లడించారు. చెరువుల భూములు ఆక్రమణలకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరిగేషన్ శాఖ అధికారులకు ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.