HYDRAA | సిటీబ్యూరో, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): హైడ్రా అనేది ఒక ప్రత్యేక విభాగమని, జీహెచ్ఎంసీలో భాగం కాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. గతంలో ఈవీడీఎం పేరుతో జీహెచ్ఎంసీలో ఒక విభాగం ఉండేదని, అప్పుడు ఐఏఎస్, కమిషనర్లు ఉండేవారని, ఇప్పుడు ఒక సెపరేట్ వింగ్‌గా ఏర్పడిందని రంగనాథ్ చెప్పారు. హైడ్రా పరిధిలోకి జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ లోపల ఉండే మరో 27 మున్సిపాలిటీలు కూడా వస్తాయన్నారు. ఇండియన్ మెట్రాలాజికల్ డిపార్ట్మెంట్ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమీర్‌పేట్‌లోని సెస్ ఆడిటోరియంలో తెలంగాణలో ఐఎండీ వెదర్, ైక్లెమేట్ సర్వీసెస్‌పై ఏర్పాటు చేసిన స్టేక్ హోల్డర్స్ ఒకరోజు సదస్సులో రంగనాథ్ పాల్గొన్నారు.
ప్రారంభోత్సవ సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం, రంగనాథ్ మాట్లాడుతూ ఐఎండీ 1875లో ఏర్పడిందని, హైడ్రా ఈ ఏడాది జూలైలో ఏర్పడిందని, డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి ఐఎండీతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రభుత్వ స్థలాలు, నగరంలోని చెరువులు పరిరక్షించడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం హైడ్రాను కొత్తగా ఏర్పాటు చేసిందన్నారు. హైడ్రా దేశంలోనే మొదటిసారి ఏర్పాటైందని, హైడ్రాకు మొదటి కమిషనర్‌గా రావడం తనకు సంతోషంగా ఉందన్నారు.
జల వనరులు, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని కాపాడటమే హైడ్రా బాధ్యత అన్నారు. హైదరాబాద్ అంటేనే గొలుసుకట్టు చెరువులని, గతంలో ఒక చెరువుకు మరో చెరువుకు కనెక్టివిటీ ఉండేదని, ఇప్పుడా కనెక్టివిటీ దెబ్బతిందన్నారు. తెలంగాణకు సముద్ర తీరం లేకున్నా.. భారీ వర్షాలతో ముంపు పొంచి ఉందని, ఈ నేపథ్యంలో భారతీయ వాతావరణ శాఖ సమాచారం చాలా ముఖ్యమని, సాంకేతికతను అందిపుచ్చుకొని వర్ష సమాచారం ఇవ్వడం ఉపయోగంగా ఉంటుందన్నారు.
ఐఎండీ ఏ ప్రాంతంలో ఎంత మొత్తంలో వర్షం పడుతున్నదని, ఎక్కడ వరద ముప్పు ఉంటున్నదో అంచనావేసి ప్రజలను అప్రమత్తం చేయడం వంటి విధానాలను అందిపుచ్చుకొని ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై ప్రజలను అప్రమత్తం చేయడంలో ఐఎండీ పాత్ర చాలా కీలకమని, ఐఎండీ పనితీరుతోనే ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గాయని గుర్తుచేశారు. డిజాస్టర్స్‌లో కూడా చాలా మార్పులు వస్తున్నాయని, తెలంగాణలో అర్బనైజేషన్ పెరుగుతున్నదని, 2050 నాటికి 50 శాతం దాటుతుందని చెప్పారు. మెట్రో సిటీస్‌లో వాతావరణ మార్పులు అధికంగా ఉంటున్నాయని, క్లౌడ్ బరస్ట్స్ పెరుగుతున్నాయన్నారు.
హైదరాబాద్‌లో నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, వర్షం పడినప్పుడు వరద నీరు ఇంకడానికి చాలా సమయం పడుతున్నదని, సాయంత్రం నాలుగైదు గంటలకు వర్షం పడితే భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నదన్నారు. వరద నీరు ఇంకడానికి మార్గాలు లేక సిటీలో 150 వాటర్ లాగింగ్స్ ఉన్నాయని చెప్పారు. అర్బన్ డిజాస్టర్ల మీద ఫోకస్ పెట్టాలని, ఇప్పటి వరకు 157 ఏడబ్ల్యూఎస్ స్టేషన్లున్నాయని, ఇంకా కావలసిన అవసరముందన్నారు. ప్రజలు వెదర్ అలర్ట్స్ని సీరియస్‌గా తీసుకునేలా హైడ్రా పనిచేస్తుందని రంగనాథ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రాలజికల్ సెంటర్ హెడ్ డా.కె.నాగరత్న పాల్గొన్నారు.