సిటీబ్యూరో/జగద్గిరిగుట్ట, జనవరి 18(నమస్తే తెలంగాణ): జగద్గిరిగుట్టలోని పరికి చెరువు పరిధిలోని అక్రమకట్టడాలను త్వరలోనే కూల్చేస్తామని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. కులసంఘాల పేరుతో ఆలయ భూములను కబ్జా చేసి ప్లాట్లు అమ్ముతున్నవారిపైనా చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట డివిజన్లోని సర్వే నెంబర్ 348/1లో శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట ఉన్న గోవిందరాజస్వామి ఆలయ కోనేరు భూమి కబ్జాకు గురవుతుందంటూ అర్చకుడు నరహరి ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి, గోవిందరాజస్వామి ఆలయ పరిసరాలను పరిశీలించి కోనేరు కబ్జా వివరాలు తెలుసుకున్నారు. జగద్గిరిగుట్టలో కులసంఘాల పేరుతో వెలసిన ప్రహరీ నిర్మాణాలను పరిశీలించారు. జగద్గిరిగుట్ట ఆలయ సముదాయాల స్థలం 14.10ఎకరాల వరకు ఉంటుందని, పరికి చెరువు 66 ఎకరాలకు పైగా ఉంటుందని స్థానికులు హైడ్రా కమిషనర్‌కు వివరించారు. కోనేరు భూమి కబ్జాకు గురవుతుంటే ఏం చేస్తున్నారంటూ స్థానిక అధికారులపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ఆలయభూమిలో కొందరు కబ్జా చేసి స్థిరనివాసాలు ఏర్పర్చుకోగా మరికొందరు కులసంఘాల పేరుతో పెద్దమొత్తంలో ల్యాండ్‌ను ఆధీనంలోకి తీసుకుని ప్రహారీలు నిర్మించారు.
అయితే జగద్గిరిగుట్ట కొండపై శ్రీ లక్ష్మీవేంకటేశ్వరాలయం ఎదురుగా ఉన్న గోవిందరాజస్వామి ఆలయ నీటికొలనును కొందరు కబ్జాలు చేసి రూములు కట్టి విక్రయిస్తున్నారని స్థానికులు రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో కబ్జాదారులు భూదేవిహిల్స్ పరిసరాల్లో అమ్మకాలు వేగవంతం చేశారు. భూదేవిహిల్స్ తోపాటు ఏకంగా దేవాదాయశాఖ ఆధీనంలోని స్థలాల ఆమ్మకాలు చేపట్టారు. దాంతో కమిషనర్ చెరువును ఆనుకుని ఉన్న భూదేవిహిల్స్, బాలకృష్ణనగర్ కాలనీలను సందర్శించారు. స్థానికంగా ఓ కార్పొరేటర్‌తో పాటు కొందరు నేతలు కబ్జాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ పోలీసులను ఆయన ఆదేశించారు. కులసంఘాల పేరుతో నిర్మించిన ప్రహారీనిర్మాణాలపై కూడా సమగ్రంగా దర్యాప్తు జరిపి కబ్జాలపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. త్వరలోనే సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించి ప్రభుత్వ భూములను కాపాడతామని ఆయన తెలిపారు. 2024 జూలై తర్వాత వచ్చిన చట్టవిరుద్ధ నిర్మాణాలను గుర్తించి వాటిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయభూములను కబ్జా చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పరికి చెరువు పరిరక్షణకు కమిటీ, వాట్సాప్ గ్రూపులు
అలాగే గాజులరామారం పరికి చెరువు కబ్జాకు గురవుతుందంటూ వచ్చిన ఫిర్యాదులపై స్థానికులతో రంగనాథ్ మాట్లాడారు. పరికి చెరువు ప్రాంతంలో ఓ కార్పొరేటర్ సహాయంతో కబ్జాదారుడు చెరువు పూడ్చి అమ్మకాలు సాగిస్తున్నారని పలువురు పేర్కొన్నారు. చెరువులో పెద్ద ఎత్తున మట్టిపోసి చెరువును పూడ్చుతున్నారని.. ఆరునెలలక్రితం హైడ్రా అధికారులు ఆక్రమణ ప్రాంతాన్ని సర్వే చేసినట్లు తెలిపారు.
ఈనెల 22న హైడ్రా కార్యాలయంలో జగద్గిరిగుట్ట ఆలయ భూముల కబ్జా, పరికి చెరువులో ఆక్రమణలపై స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశామని, సంబంధిత వ్యక్తులు, స్థానికులు అన్ని ఆధారాలు, సరైన పత్రాలతో రావాలని సూచించారు.
సమావేశం తరవాత ఆలయభూములు, పరికి చెరువు కబ్జాలపై నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు. పట్టించుకోని అధికారులపైనా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. పరికి చెరువు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి చెరువు కబ్జాకాకుండా కాపాడతామని చెప్పారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి తనను అందులో యాడ్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆయన సూచించారు. మరోవైపు హైడ్రా పోలీస్‌స్టేషన్ మరో పదిహేను రోజుల్లో పని ప్రారంభిస్తుందని రంగనాథ్ చెప్పారు. కబ్జాదారులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించారు. కమిషనర్ వెంట హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్, దేవాదాయశాఖల అధికారులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.