సిటీబ్యూరో, మార్చి 20, ( నమస్తే తెలంగాణ): శేరిలింగంపల్లి మండలం చందానగర్‌లోని గంగారాం చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం పరిశీలించారు. ఆ చెరువులో డంపింగ్ ఎవరు చేస్తున్నారు..? డంపింగ్ చేసిన వారిపై కేసులు పెట్టారా? లేదా? తదితర వివరాలను స్థానిక ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 డిసెంబరులో డంపింగ్ చేసిన వారిపై ఇరిగేషన్ అధికారులు కేసులు పెట్టారని తాజాగా హైడ్రా డీఆర్ఎఫ్ లేక్ ప్రొటెక్షన్ గార్డులు కూడా చందానగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని కమిషనర్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువుల్లో డంపింగ్ జరగకుండా చూస్తామన్నారు. ప్రతి చెరువు దగ్గర హైడ్రా లేక్ ప్రొటెక్షన్ కమిటీ గార్డులుంటారని, 24 గంటలూ తనిఖీలుంటాయని ఆయన వివరించారు. ఈ పర్యటనలో చందానగర్ కార్పొరేటర్ మంజుల, హైడ్రా అధికారులు, ప్లాట్ ఓనర్లు పాల్గొన్నారు.