ఇవ్వడం కంటే ప్రత్యామ్నాయం ఏముంటుంది? అంటూ గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆ ఇండ్లు ఆయన కట్టించిండా?.. అవి కేసీఆర్ కట్టించిన ఇండ్లు . మా బతుకులను ఆగం జేసిన రేవంత్.. సీఎంగా మాకు ఏ భరోసానివ్వలేదు. రూ.25వేల పారితోషికం కూడా వట్టి బూటకమే. ఆపత్కాలంలో ఉపయోగపడని డబ్బులు ఎందుకు? .. రోడ్డునపడ్డప్పుడే కొందరి విలువ తెలుస్తుంది. కేసీఆర్ సారూ పేదోళ్ల కోసం నిర్మించిన ఆ ఇండ్లే మాకు ఇప్పుడు దిక్కయ్యాయి. అవే లేకపోతే మమ్మల్నీ ఏం చేసేవారో.’.. ఇది మూసీ నిర్వాసితుల కన్నీటి గాథ..
Musi River | సిటీబ్యూరో/సైదాబాద్/, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చొన్నాడు… సరిగ్గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా రోమ్ చక్రవర్తిలానే ప్రవర్తిస్తున్నాడు.. మూసీ ఓ వైపు భగభగమండుతుంటే ఆ బాధితులకు ఉపశమనం కల్పించే విధానాలు చేపట్టకుండా ఒంటెద్దు పోకడతో కూల్చివేతలు తప్పవు అంటూ మరోమారు మూసీనిర్వాసితుల్లో భయాందోళనలు నింపారు. ఓవైపు గూడు కోల్పోయి రోడ్డున పడ్డ మూసీ బతుకులు అడుగుతున్న ప్రశ్నలకు.. రేవంత్ సర్కార్ వద్ద జవాబులేదు.
ఎక్కడికక్కడ కుటుంబాలన్నీ ఛిన్నాభిన్నమవుతుంటే సాంత్వన చేకూర్చే విధానాలు లేవు. విసిరేసినట్టుగా ఉమ్మడి కుటుంబాలు చెల్లాచెదురవుతుంటే ఆ మూసీ హృదయాలను బలంగా నిలబెట్టే బాధ్యతా లేదు. కన్నీళ్లతో అడుగుతున్న మూసీ నిర్వాసితుల ప్రతీ ప్రశ్నను దాటవేస్తూ.. కూల్చివేతలు ఏదో బ్రహ్మ పనిలా అనుభూతి చెందుతున్న రేవంత్.. పేదోళ్ల గూడును భూస్థాపితం చేస్తున్నారు. సీఎం అనాలోచిత విధానాలపై మూసీ నిర్వాసితులు భగ్గుమంటున్నారు.
మూసీ నిర్వాసితులకు సీఎం ఎలాటి అభయం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు కోల్పోయాం..మరి ఏం చేశాడు? అంటూ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ ప్రత్యామ్నాయం గా డబుల్ బెడ్ రూం అంటున్నాడు. అది ఎవ్వరు కట్టించారు? రేవంత్ కట్టించిండా? కేసీఆర్ కట్టించిన ఇండ్లే ఇప్పుడు మాకు దిక్కయ్యాయి.. కదా అని ఘంటాపథంగా చెబుతున్నారు. మా బతుకు ఆధారం కూల్చేసిన రేవంత్ సర్కార్ బాగుపడదని శాపనార్థాలు పెట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు నేడు మూసీ రివర్ డెవలప్మెంట్లో నిర్వాసితులకు వరంగా మారాయి. రూ.29.41 కోట్ల వ్యయంతో నిర్మించిన 288 ఇండ్లలో 2021 ఆగస్టు 28న అనాటి మంత్రి కేటీఆర్ 141 లబ్ధిదారులకు ఇండ్ల తాళం చెవులను అందజేయగా, మిగిలిన 147 ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం శంకర్‌నగర్, మూసానగర్ నిర్వాసితులకు కేటాయించింది. కేసీఆర్ ముందు చూపుతో నిర్మించడంతో తమకు ఎంతోగాను ఉపయోగపడ్డాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సిద్ధంగా లేకుంటే తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేదని అంటున్నారు.
మూసీ నిర్వాసితులకు మేమే డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టించి సొంతంగా పంచుతున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. ఇప్పుడు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఉండటంతో ఇక్కడికి తీసుకొచ్చి వదిలి పెట్టారు. ఇవే ఇండ్లు లేకుంటే మా పరిస్థితి ఏంత దారుణంగా ఉండేనో ఉహించుకుంటేనే భయమేస్తుంది. సాఫీగా కొనసాగుతున్న మా బతుకులను ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో అగం చేసింది. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఉహించలేదు.
– మహ్మద్ ఖలీల్, బాధితుడు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఒక్క ఇల్లు కూడా నిర్మించకపోయినా కొత్తగా కట్టించినట్లుగా ప్రచారం జరుగుతుం ది. కేటీఆర్ ఇక్కడ వారికి ఇవ్వగా మిగిలిపోయిన ఇండ్లు మాకు ఇచ్చారు. అందులోనే మేం ఉంటున్నాం. పనులను చేసుకోవడానికి బయటకు వెళ్లడానికి చాలా బాధ పడుతున్నాం.
-షరీఫా బీ, బాధితురాలు