Musi River | మూసీ పరిసరాల్లో సుమారు 40వేల ఇండ్లు చెదిరిపోనున్నాయి.. వందలాది కుటుంబాలు రోడ్డునపడనున్నాయి.. ఇప్పుడు హైడ్రా బుల్డోజర్లు మూసీ నివాసాలపైకి విరుచుకుపడేందుకు సిద్ధం కావడంతో నిర్వాసితుల్లో కంటిమీద కునుకు కరువైంది. మూసీ వెంట కూల్చివేతలకు ప్రభుత్వం నుంచి అన్నీ అనుమతులు రాగా, రెండు, మూడు రోజుల్లో ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానికులు.. తీవ్రంగా నిరసనలు తెలుపుతున్నారు.
ఇప్పటికే కూల్చివేతలకు వ్యతిరేకంగా ఆందోళన, జీహెచ్ఎంసీ వద్ద ధర్నాలు చేశారు. తామంతా లేబర్లమంటూ.. దూరంగా తరలిస్తే..జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైసా.. పైసా.. పోగుచేసుకొని.. ఇండ్లు కట్టుకున్నామని.. కూల్చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ప్రాణాలైనా ఇస్తాం.. హైడ్రా బుల్డోజర్లను రానివ్వమంటున్నారు. అయితే మూసీ నిర్వాసితుల నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్నా.. ప్రభుత్వం మాత్రం కనికరం చూపకుండా కూల్చివేతలకే సిద్ధం కావడం గమనార్హం.
-సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 ( నమస్తే తెలంగాణ )
‘ప్రాణాలైనా ఇస్తాం..హైడ్రా బుల్డోజర్లను రానివ్వం. మాకు డబుల్ బెడ్రూంలు అవసరం లేదు. రూపాయి రూపాయి పోగు చేసుకొని ఇల్లు కట్టుకున్నాం. మూసీ వెంట ఉన్నది అందరం లేబర్లమే. మమ్మల్నీ తీసుకొని ఎక్కడో వేస్తే ఏం చేసుకొని బతకాలే. డబుల్ బెడ్రూం అందజేసే ప్రక్రియకు నెలల తరబడి సమయం పడుతుంది. అంతవరకు మేము ఎక్కడ ఉండాలి. ఎలా బతకాలి’.. అంటూ.. మూసీ పరీవాహక ప్రాంత వాసులు కన్నీటీపర్యంతమవుతున్నారు. ఇన్నేండ్లలో ఎప్పుడు ఇలాంటి మనసులేని సీఎంను చూడలేదని వాపోతున్నారు. రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో అలజడి మొదలైంది. పెద్ద ఎత్తున నివాసాలు ఉండటంతో వీటిని తొలిగిస్తే.. చాలా మంది రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని సామాజికవేత్తలు, మేధావులు ఆందోళన చెందుతున్నారు. పునరావాసం కల్పించడమంటే కేవలం నివాసం ఇస్తే సరిపోదని.. వారి ఆర్థిక స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో సుమారు 1600 నిర్మాణాలను సర్వే ద్వారా గుర్తించామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దానకిశోర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్మాణాలను తొలిగించడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక కార్యాచరణను రూపొందించామన్నారు. సుమారు 15వేల డబుల్ బెడ్రూం ఇండ్లను మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్లో నివసిస్తున్న కుటుంబాల పునరావాసానికి కేటాయిస్తామని వివరించారు.
మూసీ పరీవాహక ప్రాంతంలో కూల్చివేతల దృష్ట్యా నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు సర్వే చేపడుతున్నట్టు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అర్హులను గుర్తించి.. వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామన్నారు. సర్వే చేసేందుకు 16 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బందితో బృందాలు ఏర్పాటు చేశామని, ఒక్కో బృందం మూసీ పరీవాహక 75 గృహాలను సందర్శించి.. వివరాలు సేకరిస్తుందన్నారు.