Musi Development | సిటీబ్యూరో: కొత్త ఇంట్లో కాలు పెట్టాలంటే.. పండుగ వాతావరణంతో సందడి సందడి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు, బంధువుల నవ్వుల మధ్య.. బ్యాండు బాజా సప్పుళ్లతో ఆ ఇంట్లో అడుగుపెడుతారు. కానీ మూసీ నిర్వాసితుల పరిస్థితి దయనీయం. గూడు కోల్పోయి.. కన్నీటితో ఇష్టం లేని ఇంట్లో అడుగు పెట్టే దుస్థితి రావడం కలిచివేస్తున్నది. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో కేటాయిస్తున్నారు.
ఇప్పటి వరకు అందరూ కలిసి మెలిసి పక్కపక్కన నివాసాలతో పెనవేసుకున్న బంధాలు కూల్చివేతల అనంతరం చెల్లాచెదురు కానున్నాయి. ఇప్పటికే అంబర్‌పేట, హిమాయత్‌నగర్, ముసారాంబాగ్, కేసీఆర్‌నగర్ పరిధిలో కొందరికీ డబుల్బెడ్రూం ఇండ్ల పట్టాలు ఇచ్చి ఖాళీ చేయించారు. ఇష్టం లేకున్నా.. భయంతో వెళ్తున్నట్లు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. 20 ఏండ్లుగా ఇక్కడే నివాసం ఉండి అందరితో కలిసిమెలిసి జీవించిన తాము ఇప్పుడు వీళ్లందరిని వదిలేసి దూరంగా వెళ్లడం ఎంత నరకంగా ఉంటుందో మనసున్న వారికి మాత్రమే అర్థమవుతుందని మాధవి అనే మహిళ బోరునవిలపించింది.
కాగా, మూసీ నిర్వాసితులకు పిల్లిగుడిసెలు, జంగమ్మెట్, ప్రతాపసింగారం, సాయి చరణ్ కాలనీ, కమలానగర్, కొల్లూర్-1, గాంధీనగర్, జై భవానీ నగర్, తిమ్మాయిగూడ, నార్సింగి, బండ్లగూడ, పోచంపల్లి, బాచుపల్లిలో ఉన్న నివాస సముదాయాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తున్నారు. మహానగరంలోని 14 ప్రాంతాల్లో మూసీ నిర్వాసితులను తరలించేందుకు రంగం సిద్ధం చేశారు.