హైదరాబాద్: హైదరాబాద్‌లోని (Hyderabad) జూబ్లీహిల్స్‌లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బొమ్మలను దుండగులు ఎత్తుకెళ్లారు. 2021లో జూబ్లీహిల్స్‌లోని నార్నే రోడ్డులో ఒక మోడ్రన్ ఫ్యామిలీ విగ్రహాలను జీహెఎంసీ ఏర్పాటు చేసింది. భార్య, భర్త.. వాళ్ల ఇద్దరు పిల్లలు.. కుటుంబమంతా సరదాగా షాపింగ్‌కు వెళ్లివస్తున్న థీమ్‌తో విగ్రహాలను ఏర్పాటుచేశారు. చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉన్న ఆ విగ్రహాలు అందర్నీ ఆకర్షించేవి. చాలామంది ఆ స్పాట్లో ఫోటోలు తీసుకునేవారు. అయితే ఆ చక్కటి కుటుంబంపై ఎవరి కన్ను పడిందో ఏమో.. భర్తను వదిలేసి భార్య, ఇద్దరు పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంత పెద్ద విగ్రహాలను తీసుకెళ్తుంటే ఎవరూ చూడలేదా, అసలు సీసీ కెమెరాలు ఏమయ్యాయి అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బొమ్మలను కూడా వదలరా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. భర్తను వదిలేసి.. కూతు, కొడుకుతో కలిసి భార్య షాపింగ్‌కు వెళ్లినట్టుందంటూ ఇంకొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.