Hussain Sagar Boat Accident | బేగంపేట్ జనవరి 27: ఆదివారం రాత్రి హుసేన్‌సాగర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో గల్లంతైన తమ కుమారుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు. కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. హుస్సేన్ సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదివారం రాత్రి భారతమాతకు మహా హారతి జరుగుతున్న క్రమంలో సాగర్ నీటిలో బోటు నుంచి పటాకులు కాల్చడంతో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి విదితమే. ఈ సంఘటనలో నాగారానికి చెందిన అజయ్(21) అనే బీటెక్ విద్యార్ధి రాత్రి నుంచి అదృశ్యమయ్యాడు.
సోమవారం ఉదయం నుంచి ఆ యువకుడి కోసం డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు సాయంత్రం వరకు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఈ ఘటనలో గాయపడిన మరో వ్యక్తి గణపతి(22) తీవ్ర గాయాలతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో ఇద్దరు ప్రణీత్‌కుమార్(32), సునిల్(35)లు అదే ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు తెలిసింది. వీర వెంకట నారాయణ అనే వ్యక్తికి స్వల్ప గాయాలవ్వడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే గల్లంతైన యువకుని తల్లిదండ్రులు జానకీరాం, నాగలక్ష్మిలు సెక్రటరియట్ పోలీసుల చుట్టూ తిరుగుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన అజయ్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్‌లో తృతీయ సంవత్సరం చదువుతున్నట్టు తెలిసింది.