Shamshabad | శంషాబాద్ రూరల్, మే 28: ఉద్యోగం చూసుకోవడం కోసం వెళ్లిన యువకుడు అదృశ్యమైన సంఘటన బుధవారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ గ్రామానికి చెందిన కుమారస్వామి(23) ఉద్యోగం చూసుకోవడం కోసమని ఈ నెల25న చెన్నైకి తన కారులో బయల్దేరాడు. కుమారస్వామి ఇంటి నుంచి వెళ్లిన తర్వాత అతని కుటుంబసభ్యులు పలుమార్లు అతనికి ఫోన్చేశారు. కానీ ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో అతను ఎక్కడ ఉన్నాడో తెలియకపోవడంతో కంగారుపడిపోయిన కుటుంబసభ్యులు.. తమ బంధువులు, వారికి తెలిసిన చోట వెతికించారు. అయినప్పటికీ కుమారస్వామి ఆచూకీ లభించలేదు. దీంతో కుమారస్వామి కనిపించడం లేదని అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.