Hyderabad | హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో యువకుడు మిస్సింగ్ ఇప్పుడు కలకలం రేపింది. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద ఆదివారం నిర్వహించిన భారతమాత మహాహారతి వేడుకల్లో రెండు బోట్లు కాలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నాగారం ప్రాంతానికి చెందిన యువకుడు అజయ్ (21) కనిపించకుండా పోయాడు.
బాణసంచాను కాల్చేందుకు పర్యాటక శాఖకు చెందిన రెండు బోట్లలో సామగ్రి తీసుకుని తన స్నేహితులతో కలిసి అజయ్ హుస్సేన్ సాగర్ మధ్యలోకి వెళ్లాడు. ఆ సమయంలోనే ప్రమాదవశాత్తూ పటాకులు పేలి రెండు బోట్లు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో బోటు డ్రైవర్ పల్లె ప్రణీత్ (32), దుబ్బాసి సునీల్ (38)కు చేతులు, కాళ్లకు మంటలు అంటుకున్నాయి. అదే బోటులో ఉన్న నలుగురు యువకులు నీటిలో దూకి ఒడ్డుకు చేరుకున్నారు. క్షతగాత్రులను గాంధీ దవాఖానకు తరలించగా, ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయం తెలియగానే అజయ్ కోసం వాళ్ల కుటుంబసభ్యులు కాల్ చేశారు. కానీ అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో ఆస్పత్రిలో ఉన్నాడేమో అని వెళ్లి చూడగా.. ఏ ఆస్పత్రిలోనూ అజయ్ ఆచూకీ కనిపించలేదు. దీంతో అజయ్ కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అజయ్‌కు ఈత రాదని కుటుంబసభ్యులు చెప్పడంతో హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండు బృందాలతో ఈ ఉదయం నుంచి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, తన బిడ్డ చాలా ధైర్యవంతుడు అని.. తన బిడ్డ తనకు కావాలని అజయ్ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది.