ఖైరతాబాద్, ఆగస్టు 26 : వైద్య పరీక్షల కోసం కూతురుతో కలిసి తండ్రి బయలుదేరాడు.. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ వాహనం.. వేగంగా వీరు ప్రయాణిస్తున్న బైకును ఢీకొట్టింది.. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో తండ్రి ఎదుటే కుమార్తె విగతజీవిగా మారింది. ఈ హృదయవిదారకర ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని బేగంపేట మెట్రో స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్పై ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం…బోడుప్పల్ చెంగిచర్లకు చెందిన మేధా శంకర్రావు మంగూరు పవర్ ప్లాట్ వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్సైగా పనిచేస్తున్నాడు.
ఆయనకు భార్య, కుమార్తె ప్రసన్న (25), కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. సోమాజిగూడలోని ఓ ప్రైవేటు దవాఖానలో శంకర్ రావుకు వైద్యపరీక్షల కోసం వెళ్లాల్సి ఉండటంతో సోమవారం ఉదయం కుమార్తె ప్రసన్నతో కలిసి బైకుపై ఆస్పత్రికి బయలుదేరారు. బేగంపేట మెట్రో స్టేషన్ సమీపంలోకి రాగానే అతివేగంగా వచ్చిన టెంపో వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు కిందపడిపోయారు. ప్రసన్న తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని గాంధీకి తరలించారు. శంకర్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన టెంపో డ్రైవర్ సతీశ్‌ను అరెస్టు చేశారు.