Hyderabad | కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 10: ఆ దంపతులకు వివాహం జరిగి తొమ్మిదేళ్లు కావస్తున్నది. ఈ క్రమంలో వారికి మొదటి సంతానమైన పసిపాప పుట్టిన నెలరోజుల్లోనే అనారోగ్యంతో మృతి చెందింది. ఆ తర్వాత పుట్టిన రెండో పసిబిడ్డ కూడా పుట్టిన వెంటనే స్వల్ప కాలంలోని మృతి చెందింది. ఇలా పుట్టిన పిల్లలు చనిపోతున్నారని ఆ భర్త మనోవేదనకురై మద్యానికి బానిస అయ్యాడు. దీంతో ఆ ఇల్లాలు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నది. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కోదండరాం, దేవి(28) లకు 2015లో వివాహం జరిగింది.
వివాహ అనంతరం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి సుభాష్ నగర్ డివిజన్ అద్దె ఇంటిలో ఉంటూ కోదండరాం ఓ ప్రైవేట్ సంస్థ పనిచేసుకుంటు కాపురం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మొదటిసారి పుట్టిన పసిపాప నెల రోజులు గడవక ముందే అనారోగ్యంతో మృతి చెందింది. మరికొన్ని రోజుల తర్వాత పుట్టిన రెండో బిడ్డ కూడా నెల గడవక ముందే మృతి చెందింది. ఈ ఆవేదనతో భర్త కోదండరాం మానసిక వేదనతో మద్యానికి బానిస అయ్యాడు. పుట్టిన పిల్లలు చనిపోయి, భర్త మద్యానికి బానిస కావడంతో జీవితంపై విరక్తి చెందిన దేవి ఈనెల 9న అర్ధరాత్రి తన భర్త పడుకున్నాక తాము ఉంటున్న రేకుల ఇంట్లో రాడుకు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సోమవారం మృతదేహాన్ని గాంధీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.