Hyderabad | అల్లాపూర్,ఫిబ్రవరి4 : వేసవి కాలంలో నీటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఇండ్లు, భవనాల్లోని నీటి వనరులు సరిపోక ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తుంటారు. కానీ ట్యాంకర్ల నిర్వాహకులు ఆ నీటిని ఎక్కడి నుంచి తెస్తున్నారో ఎప్పుడు ఎవరూ గమనించరు. దీన్ని పట్టించుకోకుండా ఆ నీటిని వినియోగిస్తే ఆనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉన్నది. అల్లాపూర్ డివిజిన్లో అయితే అక్రమంగా బోర్లు వేసి సున్నం చెరువులో నీటిని ట్యాంకర్ నిర్వాహకులు తోడేస్తున్నారు. వాటిని అలాగే ఇండ్లలోకి సరఫరా చేస్తూ.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు.
కొందరు ట్యాంకర్ డ్రైవర్లు సున్నం చెరువును కేంద్రంగా మార్చుకుని అక్రమంగా బోర్లు వేసి అందులో నీటితో జోరుగా వ్యాపారం సాగిస్తున్నారు. అక్రమంగా కరెంటు మోటర్లు, పైపులను ఏర్పాటు చేసుకుని ఏకంగా వాల్టా చట్టానికే తూట్లు పొడుస్తున్నారు. కూకట్పల్లి శేరిలింగంపల్లి మండలాల పరిధిలో ఉన్న సున్నం చెరువులో ఈ నీటి దందా బాహాటంగా కొనసాగుతున్నది. ఇందుకోసం వారు చెరువు పరివాక ప్రాంతాల్లో మోటర్లు పెట్టి అవి కనపడకుండా ఒడ్డును మట్టితో చదును చేశారు. సున్నం చెరువు నుంచి రోజుకు సుమారు 100 కిపైగా ట్యాంకర్ల నీటిని విక్రయిస్తున్నారు. ఈ నీటిని ట్యాంకర్ల ద్వారా నగరంలోని పలు వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా నీటిని తోడేయడంతో.. స్థానికంగా ఉండే బస్తీవాసుల బోర్లలో నీరు అడుగంటిపోయి నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అల్లాపూర్ డివిజన్ లో పర్యటించారు. అప్పుడు సున్నం చెరువు సమీపంలో ఉండే పద్మావతినగర్ బస్తీకి చెందిన మహిళలు పెద్దఎత్తున మేయర్ ను కలిసి నీటి కష్టాలపై తమ గోడువెల్లబుచ్చారు. లోఫ్రెజర్ కారణంగా సరిపడా నీరు సరఫరా కాకపోడంతో తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని, దీని తోడు బోర్లలో సైతం నీరు అడుగంటిపోయి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇక సున్నం చెరువులో కొందరు బోర్లు వేసి అక్రమంగా నీటిని తరలిస్తుండటంతో భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయని మేయర్ కు మహిళలు ఫిర్యాదు చేశారు. వారి మాటలు విన్న మేయర్.. అధికారుల పనితీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమంగా నీటిని తరలిస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇది జరిగి నెలరోజులు గడుస్తున్న అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వారి పనితీరుపట్ల విమర్ళలు వెలువెత్తున్నాయి. ఈ విషయంపై శేరిలింగంపల్లి ఎమ్మార్వో ను వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.