Hyderabad | జూబ్లీహిల్స్, ఏప్రిల్ 10: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచి నీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జలమండలి నిర్ణయించింది. వేసవిలో లోప్రెషర్కు చెక్ పెట్టేందుకు మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్ కార్యాచరణను అమలు చేయనున్నారు. ఈ మేరకు జలమండలి అధికారులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు.
హైదరాబాద్ నగరంలో జలమండలి సరఫరా చేసే తాగునీటి మీదనే ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది వినియోగదారులు నల్లా కనెక్షన్లకు మోటర్లు బిగించడం ఆనవాయితీగా మారిపోయింది. ఒక ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే నీటి సరఫరాకు లోప్రెషర్ ఇబ్బందులు లేదు అని చెప్పుకోవలసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఎగువ ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రెషర్ తగ్గిపోయి జలమండలి సరఫరా చేసే నీరు ఎటూ చాలని పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రతి ఇంటి నల్లా కనెక్షన్‌కు మోటర్లు బిగిస్తున్న వినియోగదారులు పొదుపును పాటించకపోవడంతో భారీ ఎత్తున తాగునీరు వృథా అయిపోతుంది. లోప్రెషర్ ఉన్న వారితో పాటు నీటి సరఫరా సమృద్ధిగా ఉన్న వాళ్లు కూడా మోటర్లు బిగించడం, ఆ నీటితోనే వాహనాలు కడగడం, ఇంటి పరిసరాలు శుభ్రం చేయడంతో నీటి దుబారా ఎక్కువైపోయింది. దీంతో నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
దీనికోసం ఏప్రిల్ 15వ తేదీ నుంచి జలమండలిలోని ఆఫీసర్ నుంచి లైన్మెన్ వరకు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఒక్కో డివిజన్లో నీటి సరఫరా జరుగుతున్న సమయంలో సీజీఎం, జీఎం, సెక్షన్ మేనేజర్లు సిబ్బందితో కలిసి కాలనీల్లో తిరిగి మోటార్లు పెడుతున్న వారిని గమనించనున్నారు. ఆ సమయంలో ఎవరైనా నల్లాకు మోటర్ బిగించి కనబడితే రూ.5వేల జరిమానా విధించనున్నారు. అలాగే మోటర్‌ను సీజ్ చేయడంతో పాటు నీటి కనెక్షన్ కట్ చేస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు.