Hyderabad | సిటీబ్యూరో, నవంబరు 5(నమస్తే తెలంగాణ): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన నల్లా బిల్లులను వసూలు చేసేందుకు జల మండలి అందుబాటులోకి తెచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)పై జల మండలి స్వరం మార్చింది. ఇక రిక్వెస్టులు ఉండవు. బకాయిదారులపై ఒత్తిడి తీసుకొచ్చి వారి నుంచి బకాయిలు రాబట్టాలనే ఎత్తుగడలో భాగంగా.. సామ భేద దండోపాయాలు అన్న తరహాలో అధికారులు ట్రీట్మెంట్ చేయనున్నారు.
బకాయిలు ఉన్న వారినే టార్గెట్‌గా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, ఈ నెల 30వ తేదీలోగా ఓటీఎస్ సద్వినియోగం చేసుకోవాలని, లేదంటే సంబంధిత నల్లా కనెక్షన్‌ను తొలగిస్తామన్న హెచ్చరికలు జారీ చేయాలంటూ జల మండలి ఈడీ మయాంక్ మిట్టల్ మంగళవారం ఓటీఎస్‌పై జరిగిన సమావేశంలో డివిజన్, రెవెన్యూ అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. గతంలో కంటే ఈ సారి ఓటీఎస్ పని తీరు బాగు లేదని, అమలులో నిర్లక్ష్యం వహించొద్దని, ప్రజల్లో విస్తృత అవగాహన పెంచి బకాయిలు రాబట్టాలని అధికారుల పనితీరుపై ఈడీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఓటీఎస్‌లో బాధ్యులైన ఒక్కో అధికారి కనీసం రూ.20 కోట్లు అయినా వసూళ్లు చేయాలని టార్గెట్ విధించారు. ఓటీఎస్ మీటింగులకు హాజరు కాకపోతే మెమోలు తప్పవని, ఇచ్చిన టార్గెట్‌లో పనితీరు బాగులేని అధికారికి స్థానం చలనం తప్పదని ఈడీ హెచ్చరించారు. బకాయిదారులందరినీ టచ్ చేయాలని, అవసరమైతే ఓటీఎస్ సద్వినియోగం చేసుకోకుంటే నల్లా కనెక్షన్ తొలగిస్తామని సంబంధిత బకాయిదారుడిపై ఒత్తిడి పెంచాలని ఆదేశించడం గమనార్హం. కాగా, ప్రభుత్వ శాఖల నుంచి రూ.1660 కోట్ల బకాయిల రాబడిలో ఆయా శాఖల ప్రధాన కార్యాలయాలకు లేఖలు రాయాలని నిర్ణయించిన అధికారులు, సాధారణ, మధ్య తరగతి ప్రజల బకాయి విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధం కావడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.
జల మండలి పరిధిలో 7,11030 మంది బకాయిదారులకు ఓటీఎస్ సద్వినియోగం కానుంది. వీరి నుంచి రూ.1792 కోట్లు జల మండలి ఓటీఎస్ రూపంలో ఆదాయం సమకూరగా.., రూ.1230 కోట్ల రిబేట్ ఉంటుంది. అయితే గత నెల 4న ఓటీఎస్‌కు ప్రభుత్వం అవకాశం ఇవ్వగా, జల మండలి సాంకేతిక కారణాలతో 17 రోజుల తర్వాత అందుబాటులోకి తీసుకువచ్చింది. దసరా, దీపావళి పండుగలు ఒకే నెలలో రావడం, ఓటీఎస్‌ను చివరి వారంలో అందుబాటులోకి తెచ్చి బకాయిలు చెల్లించాలని ఒత్తిళ్లు పెంచింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా లక్ష మంది కూడా ఇప్పటి వరకు ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోకపోవడంతో వచ్చే 25 రోజుల పాటు ఓటీఎస్ లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు టార్గెట్లు ఖరారు చేసింది. క్షేత్రస్థాయిలో బకాయిదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేసేందుకు ప్రత్యేక బృందాలు, డిస్ కనెక్షన్ గ్యాంగులను సిద్ధం చేశారు. ఉచిత తాగునీటి పథకానికి దూ రమై బకాయిలు పడిన బాధితులు ఒకవైపు, ఓటీఎస్ సద్వినియోగంలో ఆఫిడవిట్ అంటూ లబ్ధిదారులను అధికారులు భ్రయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి ఓటీఎస్ పథకం ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా బిల్లులు చెల్లిస్తామని ఆఫిడవిట్(హామీ) పత్రం ఇవ్వాలని నిబంధన విధించారు. ఆడిట్ అభ్యంతరంతో ఈ నిబంధనలు ఈ సారి తప్పనిసరి చేశా రు. క్షేత్ర స్థాయిలో చాలా మంది ఆఫిడవిట్ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి చెప్పేందుకు బకాయిదారుల నుంచి ప్రత్యామ్నాయంగా సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలని తాజాగా నిర్ణయించారు.