సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎండలు ముదురుతున్నాయి. దీంతో నగర వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 35డిగ్రీలు దాటడంతో ఉక్కపోత అప్పుడే చెమటలు కక్కిస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 35.4డిగ్రీలు, కనిష్ఠంలు 20.6డిగ్రీలు, గాలిలో తేమ 29 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రానున్న వారం రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 40కి చేరువ కానున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
కష్టపడి చదివితేనే.. లక్ష్యాన్ని చేరుకోగలం
సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : కష్టపడి చదివినప్పుడే అనుకున్న ఫలితాలు సాధించవచ్చని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సికింద్రాబాద్ ప్రభుత్వ ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కోటాజీ, ఆర్డీఓ సాయిరాం, ఏఎస్ డబ్ల్యూ మోహన్, హాస్టల్ వార్డెన్ మనోహర తదితరులు పాల్గొన్నారు.