Bike Rally | నందికొండ, సెప్టెంబర్ 22 : నాగార్జున సాగర్ హిల్‌కాలనీలోని అంతర్జాతీయ పర్యాటక కేంద్రం, బౌద్ధ వారసత్వ సంపద బుద్ధవనాన్ని బైక్ రైడర్లు ఆదివారం సందర్శించారు. నిర్వాణ రైడ్ పేరుతో హైదరాబాద్‌లో 250 బైకులతో కూడిన ర్యాలీని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, బుద్ధవనం ప్రత్యేకాధికారి ప్రకాశ్‌రెడ్డి ఆదివారం ఉదయం 7 గంటలకు జెండా ఊపి ప్రారంభించారు. బైక్ రైడర్లు మధ్యాహ్నం బుద్ధవనం చేరుకున్నారు.
బుద్ధవనం చుట్టూ ఉన్న అవుట్ రోడ్డులో బైకులతో ర్యాలీ నిర్వహించి, బుద్ధవనంలోని జాతకపార్కు, అవకాన బుద్ధ, మహాస్థూపం, ధ్యానమందిరం సందర్శించారు. బుద్ధవనంలోని జాతకపార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర పర్యాటక సంస్థ మార్కెటింగ్ జీఎం అంజిరెడ్డి, ట్రాన్స్‌పోర్టు జీఎం ఇబ్రహీం బైక్ రైడర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలోని చారిత్రక అంశాల ప్రాధాన్యత, విశిష్టతను అందరికీ తెలియజేయడానికి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇటువంటి బైక్ రైడ్లను ప్రోత్సహిస్తున్నదన్నారు. టూరిజం ఆధ్వర్యంలో ప్రతి నెలా ఒక చారిత్రక ప్రాంతానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ఓఎస్డీ సుధాన్‌రెడ్డి, బుద్ధవనం నిపుణులు ఈమని శివనాగిరెడ్డి, సహాయ శిల్పి శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.