ఉప్పల్, జూన్ 23 : భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో తీస్తూ, ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నాచారం నివాసి సన(29), రాజస్థాన్‌కు చెందిన హేమంత్ పాటియా దంపతులు. వీరికి ఐదేండ్ల కిందట వివాహమైంది. మూడేండ్ల బాలుడున్నాడు.
వీరు కొంతకాలం ఢిల్లీలో ఉద్యోగం చేశారు. అక్కడి నుంచే వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత 5 నెలలుగా హేమంత్ పాటియా సైప్రస్ దేశంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో భర్త, కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ, సూసైడ్ చేసుకుంటున్న వీడియోను సన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఫేస్బుక్ లైవ్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, కుటుంబ సభ్యుల వేధింపులే కారణమని సన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.